Share News

అచ్చమైన తెలుగు పండుగ

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:27 PM

తెలుగు వారికి సంవత్సరాది ‘ఉగాది’ పండుగను ఆదివారం జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకోనున్నారు.

అచ్చమైన తెలుగు పండుగ

నేడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరాది

ఉగాది వేడుకలకు సిద్ధమైన జిల్లా ప్రజలు

పుణ్యక్షేత్రాల్లో సందడి

కర్నూలు కల్చరల్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు వారికి సంవత్సరాది ‘ఉగాది’ పండుగను ఆదివారం జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకోనున్నారు. విశ్వావసు నామ తెలుగు సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. కొత్త దుస్తులు ధరించి, ఉగాది పచ్చడి స్వీకరించి, ఇంటిల్లిపాది ఆలయాలకు వెళతారు. పంచాంగం వింటారు. వివిధ ప్రాంతాల్లో కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నూతన వస్తు, వాహనాలను కొంటారు. కర్నూలు, నంద్యాల జిల్లాలలోని వివిధ పుణ్యక్షేత్రాల్లో ఉగాది వేడుకల సందడి బాగా కనిపిస్తోంది. ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీగిరికి చేరుకున్నారు. అలాగే మహానంది, అహోబిలం, యాగంటి వంటి పుణ్యక్షేత్రాల్లోనూ వేడుకల సందడి బాగా కనిపిస్తోంది.

నగరంలో ఉగాది వేడుకల సందడి....

నగరంలో ఉగాది వేడుకల సందడి గత మూడు రోజులుగా బాగా కనిపిస్తోంది. వస్తు, వాహన, వస్త్ర దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ఉగాది సందర్భంగా నూతన దుస్తులు ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఉగాదికి ప్రత్యేకంగా వస్త్రదుకాణాలు నూతన స్టాకు తెప్పించి అమ్మకాలకు పెట్టారు. ఉగాది పండుగ సందర్భంగా గృహాలకు రంగులు వేసుకొని శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నారు. వేడుక రోజున ఉగాది లక్ష్మికి సమర్పించే నైవేద్యాలు, పూజా సామాగ్రి, పూల కొనుగోళ్లకు నగరంలోని సీ.క్యాంపు, పెద్ద మార్కెట్‌, కొండారెడ్డి బురుజు తదితర ప్రాంతాలన్నీ జనసందడిగా మారాయి. పండ్లు, అరటి, మామిడి ఆకులు, బంతిపూలు, ఇతరత్రా పూజాద్రవ్యాల కొనుగోలు కేంద్రాలు కిక్కిరిసి కనిపించాయి.

Updated Date - Mar 29 , 2025 | 11:27 PM