బాలలతో పనులు చేయిస్తే చర్యలు
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:12 AM
రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో బాలలతో పనులు చేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్మిక, కార్మాగార, బాయిలర్స్ సర్వీసెస్ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు.

కర్మాగారాల్లో మహిళలకు వసతులు కల్పించాలి
కార్మిక, కర్మాగార, బాయిలర్స్ సర్వీసెస్ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలు, దుకాణాల్లో బాలలతో పనులు చేయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్మిక, కార్మాగార, బాయిలర్స్ సర్వీసెస్ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు. శుక్రవారం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలోని కార్మిక శాఖ, కర్మాగారాల శాఖ అధికారులు, ఫ్యాక్టరీ యజమానులు, సీఐటీయూ,ఏఐటీయూసీ నాయకులతో జిల్లా పరిషత్ సమావేశభవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించాలన్నారు. ఏదైనా సంస్థల్లో పది లేదా ఆపైన కార్మికులు పని చేస్తుంటే నెల జీతం రూ.21 వేల లోపు ఉంటే ఈఎస్‌ఐ చట్టం కింద పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. పరిశ్రమలు, కర్మాగారాల్లో పని చేసే మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని గుర్తించి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాయలసీమ జోన్ సంయుక్త కమిషనర్ ఎం.బాలునాయక్, విజయవాడ కమిషనరేట్ సంయుక్త కమిషనర్లు లక్ష్మీనారాయణ, ఏ.గణేషన్, సహాయక కమిషనర్ ఆదినారాయణ, ఉప కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.