కొండంతా.. కాషాయమయం
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:06 AM
కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మూడు రోజుల పాటు జరిగే హనుమాన్ చిన్న జయంత్యుత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు కొండగట్టుకు తరలివస్తూ స్వామి వారిని దర్శించుకుని మాలవిరమణ చేస్తున్నారు.

హనుమాన్ చిన్న జయంత్యుత్సవాలు షురూ
కొండగట్టుకు తరలివస్తున్న దీక్షాపరులు
నేడు చిన్న హనుమాన్ జయంతి
మల్యాల, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మూడు రోజుల పాటు జరిగే హనుమాన్ చిన్న జయంత్యుత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు కొండగట్టుకు తరలివస్తూ స్వామి వారిని దర్శించుకుని మాలవిరమణ చేస్తున్నారు. వేకువజామున వేలాదిగా భక్తులు అంజన్నకు మొక్కులు తీర్చుకున్నారు. జయంతి కోసం భక్తులు, అంజన్న దీక్షాపరులు వాహనాలు, కాలి నడకన కొండగట్టుకు తరలి వస్తున్నారు. కాగ శనివారం చిన్న జయంతి కోసం శుక్రవారం సాయంత్రం నుంచి భక్తుల రద్దీ పెరిగింది. వేలాదిగా భక్తులు, దీక్షపరులు కొండకు తరలివస్తున్నారు. దీంతో కొండంతా కాషాయయంగా మారింది. కలెక్టర్ సత్యప్రసాద్ కొండపై అధికారులతో కలసి ఏర్పాట్లు, సౌకర్యాలు పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు. జయంతి ఉత్సవాల ప్రత్యేక అధికారి, శ్రీనివాసరావు, ఈవో శ్రీకాంత్‌రావు, డిఎస్పీ రఘుచందర్, సీఐ నీలం రవి తదితరులు నిరంతరం కొండపైన పర్యవేక్షిస్తున్నారు.
ఫ తండోపతండాలుగా భక్తులు
వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా దీక్షాపరులు కొండగట్టుకు తరలివస్తుండడంతో కొండంతా కాషాయమయంగా మారింది. రామనామంతో అంజన్న సన్నిధి పులకిస్తోంది. అంజన్న దీక్షాపరులు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారి సన్నిధిలో మాల విరమణ చేయడం ఆనవాయితీ. దీంతో మాల విరమణ కోసం కల్యాణకట్టలో దీక్షావిరమణ మండపం ఏర్పాటు చేశారు. ఇందులోనే భక్తులు మాల విరమణ చేస్తున్నారు. కొండగట్టుకు వస్తున్న భక్తుల వాహనాలకు జెఎన్‌టీయూ మార్గంలోని బొజ్జ పోతన వద్ద పార్కింగ్ ఏర్పాటు చేయగా అక్కడి నుంచి ఆలయంకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేసింది. కాగా కొండపైన ఉత్సవాల కోసం వచ్చిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సంఖ్యే అధికంగా కనిపిస్తుంది.
ఫ నేడు హనుమాన్ చిన్న జయంతి
ఆంజనేయ స్వామి సన్నిధిలో శనివారం హనుమాన్ చిన్న జయంతిని దేవస్థానం తరుపున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్తర భారతదేశంలో ప్రతియేటా చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని నిర్వహించనుండగా ఇక్కడ కూడా అదే రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాగా జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారికి అభిషేకం, పట్టువస్త్రలంకరణ అలంకారం చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా సాయంకాలం ఆలయ ఆవరణలో భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు.