Share News

ఉపాధి బకాయి రూ.వంద కోట్లు..!

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:05 AM

స్వగ్రామంలోనే పనులు కల్పించి గ్రామీణ పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారు.

ఉపాధి బకాయి రూ.వంద కోట్లు..!
కోడుమూరు మండలం ముడుములగుర్తి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మట్టి పనులు చేస్తున్న కూలీలు

కూలీల వేతనాలు రూ.50 కోట్లు..

సీసీ రోడ్లకు రూ.50 కోట్లు

పస్తులతో పనులు చేసేదెలా..?

జిల్లాలో ఉపాధి హామీ కూలీల ఆకలి కేకలు

స్వగ్రామంలోనే పనులు కల్పించి గ్రామీణ పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారు. అమలులో లోపాలు కూలీలకు శాపంగా మారుతోంది. జనవరి 8న తేదీ నుంచి కూలి సొమ్ము రాకపోవడంతో ఉపాధి కూలీలు ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెబుతున్నా కూలీల్లో మాత్రం రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయి. రాష్ట్రంలో 1.55 లక్షల ఫారంపాండ్స్‌ (పంట కుంటలు) తవ్వకాలకు భూమి పూజ కోసం గత నెల 22న ఓర్వకల్లు మండలం పుడిచర్ల గ్రామానికి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ వచ్చారు. ఆ సమయంలోనూ కూలీలు ఏకరువు పెట్టారు. త్వరలోనే కూలీ సొమ్ము వచ్చేలా ప్రభుత్వంతో మాట్లాడుతానని పవన్‌ హామీ ఇచ్చారు. ఉపాధి కూలీల వేతనాలు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు కలిపి దాదాపు రూ.100 కోట్లు బకాయి ఉంది. వెంటనే వేతనాలు చెల్లించాలని కూలీలు కోరుతున్నారు.

కర్నూలు, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 484 గ్రామ పంచాయతీలు, 237 మజరా గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స) అమలు అవుతోం ది. ఇప్పటివరకు 3.32 లక్షల జాబ్‌ కార్డులు మంజూరు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యం. ఇప్పటి వరకు రూ.350 కోట్లు ఖర్చు చేశారు. కూలీల వేతనాలు (లేబర్‌ బడ్జెట్‌) రూ.250 కోట్లు ఖర్చు చేయగా.. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.100 కోట్లు వరకు ఖర్చు చేశారని డ్వామా అధికారులు పేర్కొన్నారు. అయితే జనవరి 8వ తేదీ తర్వాత 12 వారాలుగా కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉంటే.. ఉగాది ముందు నాలుగు వారాలు వేతనాలు జమ చేశారు. ఇంకా 8 వారాలకు సంబంధించిన కూలి సొమ్ము జమ చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసినా బకాయి డబ్బులు రాకపోవడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జి ల్లాలో ప్రతి రోజు లక్ష మందికి ఉపాధి కూలీలని లక్ష్యంగా కాగా.. ప్రస్తుతం సగటున 60-65 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారని డ్వామా అధికారులు పేర్కొంటున్నారు. మంగళవారం మస్టర్లను పరిశీలిస్తే 33,561 మంది మాత్రమే పనులకు హాజరయ్యారు. ప్రతి క్లస్టర్‌ పరిధిలో కనిష్ఠంగా 4,808, గరిష్ఠంగా 8,181 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. కూలీలకు రోజువారి వేతనాల రూపంలో రూ.50 కోట్లు, పల్లె పండుగ పేరిట మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు సుమారు రూ.85 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు వేశారు. ఆ పనులకు సంబంధించి మరో రూ.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గోకులం షెడ్లు నిర్మించుకున్న రైతులకు కూడా ఒక్క రూపాయి కూడా బిల్లులు రాలేదని అంటున్నారు. ఉపాధి హామీ కూలీల అవస్థలను ప్రజాప్రతినిధులు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బకాయిలు మంజూరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

క్లస్టర్ల వారీగా మంగళవారం హాజరైన కూలీలు

క్లస్టర్‌ లక్ష్యం హాజరు శాతం

ఆదోని 23,800 7,753 32.58

ఆలూరు 26,500 8,181 49.58

కర్నూలు 20,400 5,626 27.58

పత్తికొండ 22,500 4,808 21.37

ఎమ్మిగనూరు 15,800 7,193 45.53

మొత్తం 1,00,000 33,561 33.56

బకాయి వాస్తవమే

జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు సుమారుగా రూ.50 కోట్లు వేతన బకాయి ఉన్నమాట నిజమే. మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, గోకులం షెడ్లకు మరో రూ.50 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. త్వరితగతిన బకాయిలు చెల్లించేందుకు కృషి చేస్తున్నాం.

- వెంకట రమణయ్య, డ్వామా పీడీ, కర్నూలు

Updated Date - Apr 02 , 2025 | 12:05 AM