వైభవం.. అంజన్న రథోత్సవం
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:28 AM
పౌర్ణమిని పురస్కరించుకుని ఆదోని పట్టణంలోని కల్లుబావి కాలనీలోని మణికుప ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది.

కల్లుబావిలో కిక్కిరిసిన భక్తులు
ఆదోని, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): పౌర్ణమిని పురస్కరించుకుని ఆదోని పట్టణంలోని కల్లుబావి కాలనీలోని మణికుప ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు తీసుకొచ్చిన నైవేద్యాన్ని స్వామి వారికి సమర్పించారు. స్వామివారి సన్నిధికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన వేలాదిమంది భక్తాదులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏడాది అంపయ్య పౌర్ణమి రోజున ఆంజనేయస్వామి వార్షికోత్సవం ప్రధాన అర్చకులచే ఆధ్వర్యంలో కల్లుబావి పుర్రెడ్డి, పెద్దశివారెడ్డి, కంపాటి వీరారెడ్డి స్వగృహం నుంచి స్వామివారికి కుంభోత్సవం ద్వారా కల్లుబావి కాలనీ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా జై శ్రీరామ్, జై హనుమాన్ స్మరణతో మార్మోగింది. మణికూప అంజనేయస్వామి ప్రతిమకు మహా మంగళహారతి అనంతరం భక్తులచే ఘనంగా రథోత్సవం జరిపి, విచ్చేసిన వారికి స్వామి వారి దర్శనం కల్పించారు.