వైభవం.. జ్యోతి ఉత్సవం
ABN , Publish Date - Apr 04 , 2025 | 12:16 AM
ప్రముఖ శక్తి క్షేత్రమైన నందవరం చౌడేశ్వరిదేవి ఆలయం జ్యోతులతో హోరెత్తింది. ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన జ్యోతి మహోత్సవం నేత్రపర్వంగా సాగింది.

500కు పైగా జ్యోతులతో చౌడేశ్వరీ మాతకు నివేదన
నందవరానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
బనగానపల్లె, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ శక్తి క్షేత్రమైన నందవరం చౌడేశ్వరిదేవి ఆలయం జ్యోతులతో హోరెత్తింది. ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన జ్యోతి మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. లక్షలాది మంది భక్తులు జ్యోతి ఉత్సవాలకు హాజరయ్యారు. 500కు పైగా జ్యోతులను అమ్మవారికి నివేదనగా సమర్పించారు. అమ్మవారి జ్యోతి మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ జి.కామేశ్వరమ్మ, ఆలయ మాజీ చైర్మన్ పీవీ.కుమార్‌రెడ్డి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చౌడేశ్వరిదేవికి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భాస్కరయ్య ఆచారి సంప్రదాయంగా అమ్మవారికి దిష్టిచుక్క పెట్టిన అనంతరం జ్యోతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 2 గంటలకు గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుంచి జ్యోతి మహోత్సవం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన తోగటవీర క్షత్రియులు అమ్మవారి జ్యోతులను తలపై పెట్టుకుని నృత్యం చేస్తూ, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ఎదుట ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో నడిచి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి జ్యోతులను అమ్మవారికి సమర్పించారు. అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమైన జ్యోతుల ఊరేగింపు శనివారం ఉదయం 11 గంటల వరకు సాగింది. కాగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సతీమణి బీసీ ఇందిరమ్మ జ్యోతులను మోసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయశాఖ అధికారులు, గ్రామ పెద్దలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో చలువు పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి అర్ధరాత్రి నుంచి నిరంతరాయంగా భక్తులు చౌడేశ్వరిదేవి దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆలయ నిత్యాన్నదాన సత్రంతో పాటు పలు నిత్యాన్న సత్రాల్లో భక్తులకు అన్నదానం చేశారు. మహాసిమెంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో భక్తులు నిమ్మరసం పంపిణీ చేశారు. వైద్యఆరోగ్యశాఖ, మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐలు మంజునాథరెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐలు దుగ్గిరెడ్డి, వెంకటసుబ్బయ్య పర్యవేక్షించారు. ఈవోలు చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రుడు, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం నందవరం గ్రామంలో నిర్వహించిన చౌడేశ్వరిదేవి రథోత్సవం వైభవంగా సాగింది.