మగ వలు
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:38 PM
హోలీ పండుగ వచ్చిందంటే చాలు యువత నుంచి వృద్ధుల వరకు సంబరాలే సంబరాలు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందంగా గడుపుతారు.

కోరికలు తీరాలంటే కొంగు కట్టాల్సిందే..
సంతెకుడ్లూరులో వింత ఆచారం
హోలీ పండుగ వచ్చిందంటే చాలు యువత నుంచి వృద్ధుల వరకు సంబరాలే సంబరాలు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందంగా గడుపుతారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో మాత్రం హోలీ పండగను పురస్కరించుకొని మగవారు మహారాణుల్లా దర్శనమిస్తారు. కోరిన కోరికలు తీరాలంటే గ్రామంలో వెలసిన రతీమన్మథులను స్ర్తీ వేషధారణతో మగవారు దర్శించుకోవాల్సిందే. రెండు రోజుల పాటు గ్రామంలో రతీ మన్మథుల రథోత్సవం, కామ దహనం శవయాత్ర ఉంటాయి. మగవారి మగువల వేషధారణతో గ్రామంలో శుక్రవారం పండుగ వాతావరణం నెలకొంది.
ఆదోని రూరల్/ఆదోని మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : గ్రామంలోని బసవేశ్వరస్వామి దేవాలయంలో ఓ గదిలో రతీమన్మథులను ఉంచుతారు. ఏడాదిలోని 365 రోజుల్లో ఒక్క ఐదు రోజులు మాత్రమే రతీమన్మథులను పాల్గుణ శుద్ధ దశమికి ఐదు రోజుల ముందు దేవాలయం బయట ఉంచి పూజలు నిర్వహిస్తారు. హోలీ పౌర్ణమి రోజు, ఆ మరుసటి రోజు రతీమన్మథులు విశేష పూజలందుకుంటారు. తదనంతరం పూజార్లు, గ్రామ పెద్దలు యథావిధిగా రతీమన్మథులను దేవాలయం గదిలో భద్రపరుస్తారు. ఈ ఐదు రోజులపాటు కోరిన కోర్కెలు తీరిన మగవారు కోర్కెలు కోరే మగవారు స్వామివార్లను మహిళలకు ఏమాత్రం తీసిపోని విధంగా మగువ రూపంలో ద ర్శనం చేసుకుంటారు.
ప్రత్యేక పూజలు : గ్రామంలోని బసవేశ్వర స్వామి దేవాలయంలో వెలసిన రతీమన్మథులను హోలీ పండుగ సందర్భంగా వివిధ పూలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. దేవాలయాన్ని విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. శుక్ర, శనివారాలు రెండు రోజులపాటు స్వామివార్లను భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకుంటారు. రతీమన్మథుల దర్శనం నిమిత్తం కోరిక తీర్చే క్రమంలో బాలుడు అయితే గౌను ధరిస్తారు. యువకులైతే పంజాబీ డ్రస్ వేసుకుంటారు. అదే మగ పెద్దలు అచ్చం మగువలా అంచు పట్టుచీర కట్టుకొని బంగారు ఆభరణాలు గొంతు నిండా ధరించి నడుంకు వడ్డానం కట్టుకొని, నెత్తిన పూలు పెట్టుకొని... నుదుట బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని... కాళ్లకు పారాణి రాసుకొని, కంటికి కళ్లజోడు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి రతీమన్మథులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ వారి ప్రజలకు షరా మామూలే అనిపించినా... కొత్తవారికి మాత్రం ఇది వింతనే.
నాకు ఉద్యోగం రావాలని అమ్మ మొక్కుకుంది
నా చిన్న తనంలో మా అమ్మ నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే నాకు 11 సంవత్సరాలపాటు చీరకట్టి దర్శించుకుంటాడని రతీమన్మథులను కోరుకుంది. మా అమ్మ కోరిక మేరకే నాకు ఆస్పరి ఏపీజీబీలో పది సంవత్సరాల క్రితం ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి నేను ప్రతి ఏడాది హోలీ రోజున రతీమన్మథులకు చీరకట్టి దర్శించుకుంటున్నా.
- ఉదయ్ కుమార్, ఆస్పరి ఏపీజీబీ ఉద్యోగి, సంతేకుడ్లూరు
పుట్టుకతోనే అంధుడను..
నేను పుట్టుకతోనే అంధుడను. నా కొడుకు ప్రయోజకుడైతే చీరకట్టి మిమ్మల్ని దర్శించుకుంటాడని రతీమన్మథులను మా అమ్మ, నాన్న మొక్కుకున్నారు. నాకు రెండు కళ్లు కనిపించకున్నా కర్ణాటక రాష్ట్రం గదక్‌లోని వీరేశ్వర పుణ్య ఆశ్రమంలో నేను హార్మోనిస్టుగా ఎంతో మందికి విద్యను నేర్పిస్తున్నాను. నేను అంధుడనైనా నాకు ఈ అవకాశం దక్కినందుకు రతీమన్మథులకు ప్రతి ఏడాది చీరకట్టి దర్శించుకుంటున్నా. ఇప్పటికే 20 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
-వీరభద్రప్ప, హార్మోనిస్టు, సంతేకుడ్లూరు