Share News

బాలుడిని కబళించిన నీటిగుంత

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:32 AM

పార్కులో ఆడుకుంటున్న బాలుడికి నీటిగుంత మృత్యువు రూపంలో కబళించింది. అన్న కళ్లముందే తమ్ముడు మృత్యుఒడికి చేరిన హృదయ విదారక ఘటన సోమవారం నంద్యాల పట్టణంలో చోటుచేసు కుంది.

బాలుడిని కబళించిన నీటిగుంత
బాలుడి మృతికి కారణమైన గుంత ఇదే

నంద్యాల పార్కులో విషాదం

నంద్యాల హాస్పిటల్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): పార్కులో ఆడుకుంటున్న బాలుడికి నీటిగుంత మృత్యువు రూపంలో కబళించింది. అన్న కళ్లముందే తమ్ముడు మృత్యుఒడికి చేరిన హృదయ విదారక ఘటన సోమవారం నంద్యాల పట్టణంలో చోటుచేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మున్సిపల్‌ హైస్కూల్‌ పక్కన ఉన్న పార్కులో అన్నదమ్ములిద్దరూ ఆడుకుంటూ నీరు నిల్వ ఉన్న గుంతలో పడ్డారు. దాదాపు 7అడుగుల గుంతలో నీరు ఉండటంతో అన్న అలీ ఇతరుల సాయంతో బయటపడగా, తమ్ముడు అయాన్‌(7) గుంతలో ఇరుక్కుని మరణించాడు. చాంద్‌బాడకు చెందిన మన్సూర్‌, రజియాలకు ఇద్దరు కుమారులు. ఇరువురు పట్టణంలోని ఓప్రైవేట్‌ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం పార్కుకు వెళ్లి ఆడుకుంటూ మరణంచడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం గదివద్ద కుటుంబసభ్యుల రోదన పలువురిని కలచివేసింది.

రక్షణ కవచాలు ఏర్పాటు చేయకపోవడంతో...

పట్టణంలోని మున్సిపల్‌పార్కులో ఫిల్టర్‌బెడ్‌ కోసం చేపట్టిన నిర్మాణంలో భాగంగా దాదాపు 7అడుగుల గుంతలు తవ్వారు. ఇటీవల కురిసిన వర్షాలు, ఫిల్టర్‌బెడ్‌ క్యూరింగ్‌కోసం పోసిన నీటితో గుంత నిండిపోయింది. ప్రమాదకరమని తెలిసినా ఆ గుంతచుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేయకపోవడం బాలుడి మృతికి కారణమని తెలుస్తోంది. పనులను పర్యవేక్షించాల్సిన మున్సిపల్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ రక్షణ చర్యలు తీసుకోకపోవడంపట్ల పలువురు మండిపడుతున్నారు. ఈ పనులు దాదాపు 3నెలలనుంచి చేస్తున్నట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఆస్పత్రిలో అయాన్‌ మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 12:32 AM