Share News

కేజీబీవీ విద్యార్థుల హవా

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:12 AM

కర్నూలు జిల్లా కేజీబీవీ కళాశాలలో చదివే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాప్‌ ర్యాంకులు సాధించారు.

 కేజీబీవీ విద్యార్థుల హవా

ఇంటర్‌లో రాష్ట్రంలోనే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత

సన్‌షైన్‌ స్టార్స్‌ అవార్డుకు ఎంపికైన ర్యాంకర్లు

15న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కేజీబీవీ కళాశాలలో చదివే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాప్‌ ర్యాంకులు సాధించారు. కర్నూలు జిల్లా నుంచి కోడుమూరు, పంచలింగాల, ఓర్వకల్లు కేజీబీవీలలో చదివే ముగ్గురు విద్యార్థినులు సన్‌షైన్‌ స్టార్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 15వ తేదీ విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకోబోతున్నారు. గూడూరు కేజీబీవీ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో 983/1000 మార్కులు, కర్నూలు మండలం పంచలింగాల కేజీబీవీలో ఏఅండ్‌ టీ గ్రూపు విద్యార్థిని మానస 992/1000 మార్కులు, ఓర్వకల్లు కేజీబీవీ ఎంఈసీ గ్రూపు విద్యార్థిని 913/1000 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. వ్యవసాయ పేద కుటుంబం నుంచి వచ్చిన సాధారణ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచారు. వీరి ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సన్‌షైన్‌ స్టార్స్‌ అవార్డు ఇచ్చి సన్మానిస్తున్నారు.

చార్టెడ్‌ అకౌంట్‌ చేస్తా

ఓర్వకల్లు కేజీబీవీలో ఎంఈసీ గ్రూపులో 913 మార్కులు వచ్చాయి. సీఏ చేయాలన్నదే లక్ష్యం. చార్టెడ్‌ అకౌంటెంట్‌గా స్థిరపడాలనుకుంటున్నా. తండ్రి స్వాములు, అమ్మ వరలక్ష్మి వ్యవసాయం పనులు చేస్తున్నారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది.

- బోయ హరిత, చిన్నటేకూరు

ఇంజనీర్‌ అవుతా

మాది వ్యవసాయ కుటుంబం. నాన్న ఆనంద్‌. అమ్మ లక్ష్మి. వారిద్దరు నిరక్షరాస్యులే. వారి మాదిరిగా నేను కష్టపడకూడదని కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు ఎప్పుడూ చెబుతుండేవారు. ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు రావడం ఆనందంగా ఉంది. బీటెక్‌లో ఇంజనీర్‌గా స్థిరపడాలన్నదే ఆకాంక్ష.

- ఉప్పరి సునీత, వై. కానాపురం, గూడూరు మండలం

ఐఏఎస్‌ కావాలన్నదే లక్ష్యం

డిగ్రీలో బీకాం కోర్సు చేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతాను. ఐఏఎస్‌ కావాలన్నదే లక్ష్యం. తల్లిదండ్రులు టి. మహేష్‌, సువర్ణ పొలం పనులు చేసి మమ్మల్ని చదివిస్తున్నారు. వారి కలలను నిజం చేస్తా.

- టి. మానస, ఆర్‌. కొంతలపాడు, కర్నూలు మండలం

Updated Date - Apr 14 , 2025 | 12:12 AM