పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 12:24 AM
అమృత్‌భారత్ స్టేషన్స్ స్కీంకు ఎంపికైన నంద్యాల రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని గుంటూరు డివిజన్ రైల్వేమేనేజర్ సుధేష్ణసేన్ ఆదేశించారు.

గుంటూరు డీఆర్‌ఎం సుధేష్ణసేన్
నంద్యాల రైల్వేస్టేషన్ తనిఖీ
నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అమృత్‌భారత్ స్టేషన్స్ స్కీంకు ఎంపికైన నంద్యాల రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని గుంటూరు డివిజన్ రైల్వేమేనేజర్ సుధేష్ణసేన్ ఆదేశించారు. ఇటీవలే నూతనంగా డీఆర్‌ఎంగా బాధ్యతలు చేపట్టిన ఆమె అమృత్‌భారత్ స్టేషన్స్ పనులు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించేందుకు ఆమె సోమవారం గుంటూరు నుంచి బయల్దేరారు. మార్గమధ్యలో సాతులూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపురం రైల్వే స్టేషన్ల పరిశీలన అనంతరం నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాల రైల్వేస్టేషన్‌లోని రన్నింగ్‌రూమ్‌ను పరిశీలించి ఆవరణలో మొక్కలు నాటారు. రన్నింగ్‌రూమ్ వెనుకవైపు నిర్మాణంలో ఉన్న ఆఫీసర్స్ గెస్ట్‌హౌస్ పనులను పరిశీలించారు. అక్కడినుంచి అంబేడ్కర్ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. రైల్వే స్టేషన్ ఆవరణలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులకు సంబంధించిన మ్యాప్‌ను సంబంధిత సీనియర్ సెక్షన్ ఇంజనీర్లను అడిగితెలుసుకున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నంద్యాల రైల్వేస్టేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉండటంతో అభివృద్ధి పనుల్లో ఎలాంటి రాజీలేకుండా సూచించిన సమయానికి పనులను పూర్తిచేసి సేవలను ప్రయాణికులకు అందించాలని చెప్పారు. డీఆర్‌ఎం రాకతో సీపీఎం నాయకులు ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా స్టేషన్ ఎదురుగా ఉన్న వ్యాపార సముదాయాలను తొలగించడంతో వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని కోరారు. ఆ ఆవరణలో కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం ఉంటుందని తదనంతరం సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ఆమె చెప్పారు. నంద్యాల నూనెపల్లె ఓవర్‌బ్రిడ్జి కింద ట్రాక్ దాటకుండా కడ్డీలు ఏర్పాటుచేశారని వాటిని తొలగిస్తే అవతలివైపు ఉన్న జాతీయ రహదారికి చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుందని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి మందుబాబులు, అనుమానాస్పదవ్యక్తులు సంచరిస్తున్నారని, రాత్రిపూట విధులు నిర్వహించే రైల్వే సిబ్బందిపై దాడులకు పాల్పడుతుండటంతో కడ్డీలు వేశామన్నారు. అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం కూడా పరిశీలనలో ఉందని ఆమె తెలిపారు. డీఆర్‌ఎం వెంట గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు, నంద్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ చంద్రశేఖర్, పలు విభాగాల అధికారులు, ఇంజనీర్లు ఉన్నారు.