Share News

ఉగాది ప్రత్యేకం ... ఎడ్ల బండ్ల ప్రదర్శన

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:19 AM

కల్లూరులోని చౌడేశ్వరీదేవి ఆలయంలో ఉగాది సంబరాలు అత్యంత ప్రత్యేకతను సంతరించు కున్నాయి.

ఉగాది ప్రత్యేకం ... ఎడ్ల బండ్ల ప్రదర్శన
ఆలయం చుట్టూ ఎడ్ల బండిని తిప్పుతున్న రైతులు

నేడు రజకుల గాడిదల ప్రదర్శన

కల్లూరు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కల్లూరులోని చౌడేశ్వరీదేవి ఆలయంలో ఉగాది సంబరాలు అత్యంత ప్రత్యేకతను సంతరించు కున్నాయి. ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కార్య నిర్వహణ అధికారి గుర్రెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయంలో పంచాంగ శ్రవణం, దేవిఖడ్గమాలా స్తోత్రపూజ జరిపారు.

ఉత్సాహభరితంగా రైతుల ఎడ్లబండ్ల ప్రదర్శన

ఉగాది వేడుకల్లో భాగంగా ఎడ్లబండ్ల ప్రదర్శన ఉత్సాహభరితంగా అందరినీ అలరించింది. ముందుగా కల్లూరు ఊరివాకిలి రైతులు మొక్కులు తీర్చుకునేందుకు ఎద్దులను అలంకరించి ఊరేగించారు. ఊరువాకిలి నుండి మేళతాలతో ఊరేగిస్తూ అమ్మవారి ఆలయం చుట్టూ రైతులు ఎద్దులబండ్ల ప్రదక్షిణ చేశారు. ఆలయంలో నారుమడి పద్ధతిలో రైతుసంఘం, ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బురదనీటిలో రైతులు, యువత కేరింతల నడుమ ఎడ్లబండ్ల ప్రదర్శన కన్నులపండువగా నిర్వహించారు. తమ మొక్కులను తీర్చుకునేందుకు తరలి వచ్చిన ఎండ్లబండ్ల ఊరేగింపు తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు, భక్తులు ఆశేషంగా తరలివచ్చారు. ఇదే తరహాలో నేడు రజకులు పుష్కలంగా వర్షాలు కురవాలని భక్తిశ్రద్దలతో గాడిదలను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు.

గౌరు దంపతుల పూజలు: కల్లూరులోని చౌడేశ్వరీదేవి ఆలయాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, నందికొట్కూరు టీడీనీ ఇన్‌చార్జ్‌ గౌరు వెంకటరెడ్డి ఆదివారం సందర్శించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గౌరు దంపతులకు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. చౌడేశ్వరీదేవి ఆమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అట్లాగే మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని ఉమామహేశ్వరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:19 AM