మెరుగైన వైద్య సేవలు అందిస్తాం
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:59 PM
ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.డీవీఎస్‌ఎల్ నరసింహం అన్నారు.

అందరూ ఆరోగ్యసేవలపై సంతృప్తి చెందాలి
పీపీపీ కింద ఆదోని మెడికల్ కాలేజీ
ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల
డీఎంఈ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.డీవీఎస్‌ఎల్ నరసింహం అన్నారు. శనివారం కర్నూలుకు వచ్చిన ఆయన కర్నూలు మెడికల్ కాలేజీ ఆవరణంలోని కాన్ఫరెన్స్ హాల్లో హెచ్‌వోడీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్య సేవల పట్ల ప్రజలందరూ సంతృప్తి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న ఆదోని, పులివెందుల, మదనపల్లె, మార్కాపురం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. రాష్ట్రంలోని 17 టీచింగ్ హాస్పిటల్స్‌లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఓపీడీ బ్లాక్ విషయం వైద్యఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. క్రైం కేసుల్లో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నారని, బయటి సమాజానికి ఇది మాత్రమే కనిపిస్తుందని, తెర వెనుక మాత్రం ఫోరెన్సిక్ వైద్యులే ఉన్నారన్నారు. చాలా కేసుల్లో డాక్టర్ల పోస్టుమార్టం నివేదికలు ఆధారంగా సాక్ష్యాలు లభిస్తాయని, అందుకే పోలీసులు, ఫోరెన్సిక్ వైద్యుల మద్య బంధం నెలకొందన్నారు. ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కే.చిట్టినరసమ్మ, డా.కే.వెంకటేశ్వర్లు మాట్లాడారు. గతంలో పోలిస్తే ఫోరెన్సిక్ విభాగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా.సీఎస్ కృష్ణప్రకాష్, రిటైర్డు ఫోరెన్సిక్ ప్రొ.డా.వీరనాగిరెడ్డి, ఏపీఏఎఫ్‌ఎంటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సుబ్బరావు, వివి రాష్ట్రాల నుంచి వచ్చిన వైద్యులు పాల్గొన్నారు.