Crusher Mafia Clampdown: గుంటూరు లోనూ అజయ్ దందా
ABN , Publish Date - Apr 16 , 2025 | 06:45 AM
గుంటూరులోని క్రషర్ యూనిట్లపై మైనింగ్ డాన్ అజయ్ దందా విస్తరించేందుకు యత్నించినా, వ్యాపారుల అప్రమత్తతతో ఆ పన్నాగం విఫలమైంది. విజిలెన్స్ బెదిరింపులతో ఒత్తిడి తెచ్చినా, వ్యాపారులు అజయ్ కుట్రను గుర్తించి ఎదురు నిలిచారు.

ఆరు క్రషర్లపై కన్నేసిన వైనం
వ్యాపారుల అప్రమత్తతతో ఫలించని ప్రయత్నం
ఇక ‘మైనింగ్ డాన్’కు కళ్లెం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మైనింగ్ డాన్... కొల్లాం అజయ్ లీలలు మరిన్ని బయటపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని జిల్లాలకు ఆయన దందా విస్తరించినట్లు వెల్లడైంది. ‘మైనింగ్ డాన్’పై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. అజయ్ రచ్చపై ఉన్నతస్థాయిలో దృష్టి సారించి... ఆయనకు కళ్లెం వేసేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు... గుంటూరులోని క్రషర్స్ వ్యాపారులపైనా అజయ్ తన ప్రతాపం చూపించినట్లు తెలిసింది. అమరావతి నిర్మాణం కోసం భారీగా మెటల్ అవసరమవుతోంది. దీంతో... అజయ్ గుంటూరులోని ఆరు ప్రముఖ క్రషర్‌యూనిట్లపై కన్నేశారు. వాటిని తమకు ఇచ్చేయాలని గనుల అధికారి ద్వారా రాయబారం పంపించారు. ఇందుకోసం తొలుత గనుల శాఖలోని కీలక వ్యక్తి వద్ద పని చేసిన ఒక అధికారి ఆయా కంపెనీలకు, గుంటూరు గనుల అధికారికి ఫోన్ చేశారు. ‘‘ఆ మైన్‌లు మాకు కావాల్సిన వ్యక్తికి కావాలి. 2 లక్షల టన్నుల రాయిని సరఫరా చేసే కాంట్రాక్టు మేం తీసుకోబోతున్నాం. కాబట్టి మీ యూనిట్లను అజయ్‌కి అప్పగించండి. లేదంటే విజిలెన్స్ దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఫోన్‌లో హెచ్చరించారు. గుంటూరు వ్యాపారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇదంతా అజయ్ చేయిస్తున్న మంత్రాంగమని గ్రహించారు. చివరికి... ఈ వ్యవహారంలో గుంటూ రు గనుల అధికారి బద్నాం అయ్యారు. దీంతో ఆయన మనస్తాపానికి గురై సెలవుపై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.