Nara Lokesh: బతిమలాడి రప్పిస్తున్నాం
ABN, Publish Date - Jan 11 , 2025 | 03:55 AM
రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
మళ్లీ జగన్ రాడనే గ్యారెంటీని
పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు
కూటమి ప్రభుత్వంతో మంచి రోజులు
అనుమతులు, భూ కేటాయింపులు
వేగంగా మంజూరయ్యేలా చూడాలి
20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
మంత్రివర్గ ఉపసంఘం భేటీలో లోకేశ్
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ మొదటి సమావేశం ఆయన అధ్యక్షతన శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్, చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ‘గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు రాలేదు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు మనకంటే ముందున్నాయి. పెట్టుబడులు సాధించడం అంత ఈజీ కాదు. మళ్లీ జగన్ అధికారంలోకి రాడనే గ్యారెంటీని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పీపీఏలను రద్దు చేశారు. అనేక పరిశ్రమలను పొరుగు రాష్ర్టాలకు తరిమేశారు. వారిని బతిమలాడి తిరిగి రాష్ర్టానికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడిదారులకు అనుమతులు, భూకేటాయింపులు త్వరగా మంజూరయ్యేలా చూడాలి. కూటమి పాలనలో మళ్లీ మంచి రోజులు వచ్చాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఇక్కడకు రావాల్సిన పెట్టుబడి ఒక్కటి కూడా ఇతర రాష్ర్టాలకు వెళ్లడానికి వీల్లేదు’ అని పేర్కొన్నారు.
నైపుణ్య గణనకు ఇన్ఫోసి్‌సతో ఒప్పందం: లోకేశ్
నైపుణ్య గణనలో సాంకేతిక సహకారం అందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసి్‌సతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేశ్ సమక్షంలో శుక్రవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎ్‌సఆర్) కింద నైపుణ్య గణనకు సహకారం అందించేందుకు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయం. 3.59 కోట్ల మందిలో ఉన్న నైపుణ్యాలపై ఇన్ఫోసిస్ ప్రీవాలిడేషన్ చేస్తుంది’ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సంతోశ్, తిరుమల, రాష్ట్ర ఉన్నతాధికారులు కోన శశిధర్, గణేశ్ కుమార్, దినేశ్ కుమార్ పాల్గొన్నారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన
త్వరలో రాష్ట్రవ్యాప్త నైపుణ్య గణనకు శ్రీకారం చుడతామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. నైపుణ్య గణన విధివిధానాలపై శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో సమీక్షించారు. మంగళగిరిలో చేసిన పైలెట్ ప్రాజెక్టు అనుభవనాలను పరిగణలోకి తీసుకుని, మరింత సులభతరంగా నైపుణ్య గణన చేయాలన్నారు. ఈ గణనలో సేకరించే డేటా యువతకు జీవితకాలం ఉపయోగపడాలన్నారు. వ్యవస్థీకృత రంగాలతో పాటు అసంఘటిత రంగాల్లో ఉన్నవారి నైపుణ్యాలను సేకరించాలని స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన వారికి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సొంత నిధులతో శిక్షణ ఇస్తున్నారని, దానిని నమూనాగా తీసుకుని విదేశాల్లో ఉద్యోగాలు సాధించేలా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. దీనివల్ల 2 లక్షల మందికి విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కాలేజీ విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషలు కూడా నేర్పించాలన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే నైపుణ్య గణన లక్ష్యమని లోకేశ్ చెప్పారు.
Updated Date - Jan 11 , 2025 | 08:09 AM