Bail Petition Rejected: మిథున్‌రెడ్డికి చుక్కెదురు

ABN, Publish Date - Apr 04 , 2025 | 04:32 AM

మద్యం కుంభకోణంపై సీఐడీ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఆయనపై నేరారోపణలు లేవని, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని కోర్టు పేర్కొంది

Bail Petition Rejected: మిథున్‌రెడ్డికి చుక్కెదురు
  • హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

  • ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

  • దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది

  • పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చలేదు

  • అరెస్టుపై ఆందోళన అక్కర్లేదు: హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంపై సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, రికార్డులను పరిశీలిస్తే ఈ దశలో ఆయనపై ఎలాంటి నేరారోపణలూ లేవని తెలిపింది. ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు అధికారి కూడా తన ముందున్న సమాచారం సరైనదా? కాదా? అని ఇంకా పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొంది. ‘దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది, ఈ దశలో అరెస్ట్‌ చేస్తారనే ఆందోళన అవసరం లేదు’ అని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంది. పోలీసుల చర్యలపై ఏమైనా అభ్యంతరం ఉంటే చట్టపరంగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు తీర్పు చెప్పారు. మద్యం కుంభకోణంపై గతేడాది సెప్టెంబరు 23న సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మిథున్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం నిర్ణయం వెల్లడించారు. ఈ కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగా చేరిస్తే కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా వారం ముందు నోటీసులు ఇచ్చేలా సీఐడీని ఆదేశించాలన్న సీనియర్‌ న్యాయవాది అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.


తీర్పులో ఏముందంటే...

‘అస్పష్టమైన, సాధారణ ఆరోపణల ఆధారంగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేయలేం. ఇలాంటివి అనుమతిస్తే ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వరదలా వచ్చి పడతాయి. పిటిషనర్‌పై నిర్దిష్ట ఆరోపణలు లేవు. నిందితుడిగా కూడా చేర్చలేదు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పొందేందుకు పిటిషనర్‌ అనర్హుడు’ అని తీర్పులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:34 AM