Nara Lokesh: జూన్ నాటికి విద్యాశాఖ సంస్కరణలు పూర్తి
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:04 AM
విద్యాశాఖ సంస్కరణలను జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. మెగా డీఎస్సీ, టెన్త్ & ఇంటర్ ఫలితాలు, మరియు డాష్‌బోర్డ్ అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలన్నారు

వచ్చే నాలుగేళ్లు ప్రమాణాల పెంపుపైనే దృష్టి
న్యాయ వివాదాలకు తావు లేకుండా వీలైనంత త్వరగా డీఎస్సీ విడుదల
ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ ఉండొద్దు
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో పారదర్శకత
సమీక్షలో అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశాలు
కేజీబీవీ టీచర్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలను జూన్ నాటికి పూర్తి చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో సమీక్షించారు. సంస్కరణలు పూర్తిచేసిన తర్వాత రాబోయే నాలుగేళ్లు విద్యా ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాలన్నారు. న్యాయ వివాదాలు రాకుండా వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ విడుదలకు సన్నద్ధం కావాలన్నారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా టెన్త్, ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని సూచించారు. మన మిత్ర యాప్‌లో కూడా ఫలితాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఆగస్టులో జరిగే రాష్ర్టాల విద్యాశాఖ మంత్రుల సదస్సును ఏపీలో నిర్వహించేందుకు కేంద్ర మంత్రి అంగీకరించారని, అందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు వివరాలతో మే నాటికి డ్యాష్‌బోర్డు అందుబాటులోకి తీసుకువాలన్నారు. విద్యార్థుల లీవ్ యాప్‌ను ఆపార్ ఐడీతో లాగిన్ అయ్యి చూసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రాపౌట్స్ నమోదు కాకూడదన్నారు. సమగ్ర శిక్ష పరిధిలోని పాఠశాలల్లో పారదర్శకంగా అడ్మిషన్లు చేపడుతున్నామని సంబంధిత అధికారులు వివరించారు. కేజీబీవీల్లో టీచర్ల బదిలీలకు మంత్రి ఈ సందర్భంగా ఆమోదం తెలిపారు. అలాగే అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ, ఉపాధ్యాయ శిక్షణ సంస్థ, ఆర్కివ్స్ మ్యూజియం నిర్మాణాలకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల మేధస్సుకు పదునుపెట్టే క్లిక్కర్స్‌ను 9వ తరగతి విద్యార్థులకు అమలు చేయాలని, వాటి వల్లే వచ్చే ఫలితాల ఆధారంగా 6 నుంచి 10 తరగతులకు అమలు చేయాలన్నారు. జీవో 117కు ప్రత్యామ్నాయ జీవోను వీలైనంత త్వరగా విడుదల చేయాలన్నారు.
పాఠశాలలు తెరిచే సమయానికి పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉండాలని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల విషయంలో పారదర్శకత ఉండాలని, ఎలాంటి పైరవీలకు తావు ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు. సమీక్షలో ఉన్నతాధికారులు కోన శశిధర్, వి.విజయరామరాజు, కృతికా శుక్లా, బి.శ్రీనివాసరావు, దీవన్ రెడ్డి పాల్గొన్నారు.
ఏయూ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: లోకేశ్
ఆంధ్రా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. వర్సిటీ శతాబ్ది ఉత్సవాలు, అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. 1926లో యూనివర్సిటీని స్థాపించారని, ఈ సందర్భంగా ఈనెల 26 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 26 వరకు ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తామని వీసీ జీపీ రాజశేఖర్ మంత్రికి వివరించారు. ఘన చరిత్ర కలిగిన ఏయూ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. క్యూఎస్ ర్యాంకింగ్‌లో ఏయూ టాప్-100లోకి రావడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. త్వరలోనే వర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.