Minister Dola : ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం!

ABN, Publish Date - Feb 18 , 2025 | 04:17 AM

చివాలయంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని

Minister Dola : ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించం!
Dola Sree Bala Veeranjaneya Swamy
  • అవసరమైతే కొత్తగా నియామకాలు

  • ఉద్యోగుల సమస్యలపై సమీక్షించి నిర్ణయం

  • ఆయా సంఘాల నేతలతో మంత్రి డోలా

అమరావతి, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో ఒక్క గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగినీ తొలగించే ప్రసక్తే లేదని, అవసరమైతే కొత్త ఉద్యోగులను నియమిస్తామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశమైన సందర్భంగా.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియపై ఐదారు సార్లు సమీక్ష నిర్వహించామని, జనాభా ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగులను ఏ, బీ, సీ క్యాటగిరీలుగా నియమించాలని నిర్ణయించామని తెలిపారు. హేతుబద్దీకరణ తర్వాత అవసరమైన ఉద్యోగులను నియమించి, ఏ ఉద్యోగిపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సరైన పదోన్నతి విధానాన్ని కూడా సులభతరం చేస్తామన్నారు. ఆలస్యం లేకుండా ప్రజలకు రియల్‌టైంలో సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు సచివాలయాల్లో ఏఐ, డ్రోన్‌ టెక్నాలజీ, ఐవోటీలను అమలు చేస్తామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్‌ డిక్లరేషన్‌, జీతం స్కేల్‌, వివరణాత్మక జాబ్‌చార్ట్‌ అంశాలను ఉద్యోగ సంఘాల నేతలు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. సచివాలయ ఉద్యోగులకు జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ వర్తింపచేయాలని, వివిధ క్యాటగిరీల సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు, ఇతర సర్వీసు విషయాల్లో స్పష్టత ఇవ్వాలని కోరారు. హేతుబద్దీకరణ ప్రక్రియలో ఇచ్చిన జీఓఎంఎస్‌ నెం.1లోని క్లాజ్‌ 3లో చెప్పినట్లు మల్టీపర్పస్‌ కార్యదర్శులు, టెక్నికల్‌, ఆస్పిరేషనల్‌ కార్యదర్శులు ఎవరెవరు ఏయే కేటగిరి కిందకు వస్తారో పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు.


3,500కు పైగా జనాభా ఉన్న సచివాలయాలకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున 3,501 జనాభా దాటిన ప్రతి 500 లేదా 1,000 మందికి అదనంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2022లో ఇచ్చిన 11వ పీఆర్సీ ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్‌ నెంబర్‌ 2లో సచివాలయ ఉద్యోగుల జీత భత్యాలను 2015 పీఆర్సీలోనివి యథాతథంగా ఉంచారని, ఆ తప్పు పునరావృతం కాకుండా రాబోవు 12వ పీఆర్సీలో చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మంది సచివాలయ ఉద్యోగులు ఒకేసారి ఉద్యోగం పొందిన కారణంగా చాలా మంది ఇప్పటి వరకు సరైన పదోన్నతికి నోచుకోలేదని, అందరినీ వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసి పదోన్నతి కల్పించాలన్నారు. చాలా మంది జీవిత భాగస్వాములు వివిధ జిల్లాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల కుటుంబపరంగా ఇబ్బందులు పడుతున్నారని, మ్యూచువల్‌, భాగస్వామ్య బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో 39 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సచివాలయ ఉద్యోగుల సమస్యలు, పని పరిస్థితులకు సంబంధించి కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నతాధికారులతో సమీక్షించి, సర్వీసు రూల్స్‌ పరిగణనలోకి తీసుకుని సచివాలయ ఉద్యోగులు పేర్కొన్న సమస్యలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉద్యోగ సంఘాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. ఈ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌, డైరెక్టర్‌ శివప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 02:59 PM