Jagan Visit Security: భద్రతా వైఫల్యం లేదు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:23 AM
జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం లేదని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపారు. 1100 మంది పోలీసులతో పర్యటనకు పూర్తి భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు

1100 మంది పోలీసులతో భద్రత
హెలిప్యాడ్ వద్ద 250 మంది పోలీసులు
రెచ్చగొట్టినా సంయమనం వహించాం
శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న వెల్లడి
చెన్నేకొత్తపల్లి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఎక్కడా భద్రతా వైఫల్యం లేదని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న స్పష్టం చేశారు. నిష్పాక్షికంగా విధులు నిర్వహించామని తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆమె చెన్నేకొత్తపల్లి సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘పాపిరెడ్డిపల్లి చిన్నగ్రామం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని, జన సమీకరణ చేయవద్దని వైసీపీ నేతలను కోరాం. కానీ... వాళ్లు పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ చేశారు. సోషల్ మీడియాలోనూ పిలుపు ఇచ్చారు. అయినా పూర్తిస్థాయి భద్రత కల్పించాం. జగన్ పర్యటనకు 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. హెలిప్యాడ్ వద్ద తొలుత 150 మందిని... ఆ తర్వాత జనం ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో మరో వందమందిని నియమించాం’’ అని ఎస్పీ వివరించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని...ఈ ఘటనకు ప్రధాన కారణం ఇదే అని అన్నారు. కొంతమంది హెలికాప్టర్ డోర్‌ను లాగడంతో అది దెబ్బతిన్నట్లు తెలిసిందన్నారు.
చర్యలు తీసుకోవచ్చు...
పోలీసుల బట్టలూడదీస్తామన్న జగన్‌వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా...దానిపై తాను స్పందించనని ఎస్పీ చెప్పా రు. ‘‘పోలీసు యూనిఫాం మేము కష్టపడి సాధించుకున్నది. ఎవరో ఇచ్చింది కాదు. విధి నిర్వహణలో తప్పు చేసి ఉంటే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. జగన్ పర్యటనలో వైసీపీ నాయకులు పోలీసులను కవ్వించినా ఎక్కడా సంయమనం కోల్పోలేదు’’ అని ఎస్పీ తెలిపారు. లింగమయ్య హత్యకేసు విచారణలో సక్రమంగా వ్యవహరించడంలేదన్న ఆరోపణలను తోసిపుచ్చారు. హత్య జరిగిన 48గంటల్లో నిందితులను అరెస్టు చేశామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
For More AP News and Telugu News