Share News

Deputy CM Pawan Kalyan: ముగిసిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర

ABN , Publish Date - Feb 16 , 2025 | 04:58 AM

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర శనివారం ముగిసింది.

Deputy CM Pawan Kalyan:  ముగిసిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర

  • చివరి రోజు సోలైమలై, తిరుత్తణి ఆలయాలను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌

  • పూర్ణకుంభంతో జనసేనానికి స్వాగతం

  • మురుగన్‌, సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు

  • వెంట కుమారుడు అకిరా నందన్‌, ఆనంద్‌సాయి

చెన్నై/తిరుత్తణి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర శనివారం ముగిసింది. బుధవారం కేరళలోని ఆలయాలను సందర్శించిన ఆయన.. గురువారం తమిళనాడులోని తంజావూరు, కుంభకోణం, తిరుచ్చెందూర్‌ ఆలయాలు, శుక్రవారం పళని, తిరుప్పరంకుండ్రం, మదురై మీనాక్షి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం మదురై జిల్లా అళగర్‌ కొండల్లో కొలువైన పలముదిర్చోలై అరుల్మిగు సోలైమలై మురుగన్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పవన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మురుగన్‌కు ఆయన పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు క్షేత్ర విశిష్టతను వివరించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బయల్దేరిన పవన్‌.. ఆలయ పారిశుధ్య కార్మికులను చూసి తన కాన్వాయ్‌ ఆపి వారితో కాసేపు మాట్లాడారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగారు. అనంతరం వారికి ఆర్థికసాయం కూడా అందించారు. మధ్యాహ్నం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలో కొలువైన శ్రీవల్లి, దేవసేన సమేత శ్రీ మురుగన్‌ స్వామి ఆలయానికి చేరుకున్నారు. పవన్‌కు ఆలయ అర్చకులు, తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తిరుత్తణిలో షణ్ముఖునిగా దర్శనమిచ్చే మురుగన్‌కు ఆయన పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య విశిష్ట మంత్రోచ్ఛారణలతో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి, పంచహారతులిచ్చారు.


అనంతరం స్వామివారికి కుడివైపు కొలువైన శ్రీవల్లి అమ్మవారిని, ఎడమవైపు వెలసిన దేవసేన అమ్మవార్లను, ఆలయంలో ఉత్తరాన ఉన్న దుర్గాదేవిని ఆయన దర్శించుకున్నారు. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల అనంతరం ఆలయ మంటపంలో అర్చక స్వాములు పవన్‌కు వేదాశీర్వచనాలు, స్వామివారి చందన ప్రసాదం అందజేశారు. ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి చిత్ర ఆయన్ను సత్కరించారు. పవన్‌ వెంట ఆద్యంతం ఆయన కుమారుడు అకిరా నందన్‌, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ఉన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యస్వామి ఆరుక్షేత్రాల దర్శనం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు.

Updated Date - Feb 16 , 2025 | 04:58 AM