Share News

Polavaram Project: పోలవరం బనకచర్ల కోసం జలహారతి కార్పొరేషన్‌

ABN , Publish Date - Apr 09 , 2025 | 04:10 AM

పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు కోసం ‘జలహారతి కార్పొరేషన్’ ఏర్పాటైంది. 80,112 కోట్లు అంచనా వ్యయం, రుణాలు, ప్రభుత్వ బాండ్ల ద్వారా నిధుల సేకరణ

Polavaram Project: పోలవరం బనకచర్ల కోసం జలహారతి కార్పొరేషన్‌

  • సీఎం చైర్మన్‌, మంత్రి వైస్‌ చైర్మన్‌, ఎండీ-సీఈవోగా ప్రత్యేక సీఎస్‌

  • ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు

  • బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాల సేకరణ

  • ప్రభుత్వ బాండ్ల ద్వారానూ నిధులు

  • జలవనరుల శాఖ నుంచి డిప్యుటేషన్‌పై 15 మంది ఇంజనీర్లు

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు కరువును శాశ్వతంగా దూరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి మార్గం సుగమమైంది. ‘జలహారతి కార్పొరేషన్‌’ పేరిట స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. ఇది నూటికి నూరు శాతం ప్రభుత్వ కంపెనీ. పూర్తిగా జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇందులో ముఖ్యమంత్రి (చైర్మన్‌), జలవనరుల మంత్రి (వైస్‌చైర్మన్‌), జలవనరుల శాఖ కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/ప్రత్యేక సీఎస్‌ (ఎండీ-సీఈవో), ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ ఈఎన్‌సీ లేదంటే రాష్ట్రప్రభుత్వం నియమించే వ్యక్తి డైరెక్టర్లుగా ఉంటారు.

ijfsdd.jpg


  • రూ.10 ముఖ విలువ కలిగిన 49,99,993 షేర్లు రాష్ట్రప్రభుత్వం (జలవనరుల శాఖ) పేరిట ఉంటాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌/ఈఎన్‌సీ, అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌/ఈఎన్‌సీ, పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌, కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌, ఒంగోలు ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌, కర్నూలు ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌కు తలో షేరు కేటాయించారు.

  • జలహారతి కార్పొరేషన్‌లో జలవనరుల శాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఓ చీఫ్‌ ఇంజనీర్‌ను, ఇద్దరు ఎస్‌ఈలు, ముగ్గురు ఈఈలు, 10 మంది డీఈఈ/ఏఈఈలు ఉంటారు. మార్కెట్‌ నుంచి ముగ్గురు సీఏలు/అకౌంట్స్‌ అధికారులను నియమిస్తారు. ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌వో)గా ఆర్థిక శాఖ అదనపు డైరెక్టర్‌ గానీ, మార్కెట్లో 15 ఏళ్లు చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా అనుభవం ఉన్న వ్యక్తి గానీ ఉంటారు.

  • ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణసమీకరణ చేస్తారు. ప్రభుత్వ బాండ్ల ద్వారా కూడా నిధులు సేకరిస్తారు.

  • పబ్లిక్‌ మార్కెట్ల ద్వారానూ వనరులు సమీకరించవచ్చు.

  • ఈ నిధులను ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులకు మళ్లించే ఆస్కారం లేదు.


గోదావరి వరద నీటితో కరువు నివారణ..

పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంతో కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని, 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించవచ్చని, 80 లక్షల మందికి తాగునీరు అందించవచ్చని జలవనరుల శాఖ చెబుతోంది. గోదావరి నదిలో 90 నుంచి 120 రోజుల పాటు వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ వరదనీటిని పల్నాడు, రాయలసీమకు తరలిస్తే శాశ్వతంగా కరువును నివారించవచ్చని అంటోంది. ఇందుకోసమే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. తాడిపూడి నుంచి నుంచి జక్కంపూడి వరకు సమాంతర కాలువ నిర్మించి గ్రావిటీ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. ఆ నీటిని బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయరుకు పంపుతారు. అక్కడి నుంచి కాలువలు, ఎత్తిపోతలు, సొరంగాల ద్వారా బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు తరలించాలన్నది ప్రణాళిక.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..

అమ్మాయితో రాజకీయమా..

సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే

For More AP News and Telugu News

Updated Date - Apr 09 , 2025 | 05:37 AM