Share News

వెలిగొండపై ముందడుగు

ABN , Publish Date - Apr 16 , 2025 | 02:25 AM

వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్‌ పనులకు సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ప్యాకేజీ 2, ప్యాకేజీ-4లలో పెండింగ్‌లో ఉన్న పనులకు రూ.106.39 కోట్లను మంజూరు చేసింది. అత్యవసరాన్ని బట్టి తొలుత టెండర్‌ పొందినవి కాకుండా ఇతర ఏజెన్సీలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆమేరకు ఆమోదం తెలుపుతూ మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది.

వెలిగొండపై ముందడుగు
వెలిగొండ మొదటి టన్నెల్‌

రూ.106.39 కోట్ల పనులకు ఆమోదం

ప్యాకేజీ-2,4లలో పెండింగ్‌లో ఉన్నవి

కొనసాగింపునకు మంత్రివర్గం తీర్మానం

మెగా, ఎస్‌సీఎల్‌ కంపెనీలు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్‌

ఒంగోలు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్‌ పనులకు సంబంధించి మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ప్యాకేజీ 2, ప్యాకేజీ-4లలో పెండింగ్‌లో ఉన్న పనులకు రూ.106.39 కోట్లను మంజూరు చేసింది. అత్యవసరాన్ని బట్టి తొలుత టెండర్‌ పొందినవి కాకుండా ఇతర ఏజెన్సీలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆమేరకు ఆమోదం తెలుపుతూ మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులను 2026 జూలైకి పూర్తిచేసి నీరు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సంకల్పా నికి అనుగుణంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. సాంకేతిక నిపుణులు, ఉన్నత స్థాయి ఇంజనీరింగ్‌ అధికారులు పనులను పరిశీలిస్తున్నారు. ఈక్రమంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పనుల పురోగతికి, ప్రస్తుతం నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన నిధుల మంజూరు, సాంకేతిక అనుమతులను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం ఇస్తోంది. వెలిగొండకు వార్షిక బడ్జెట్‌లో రూ.301కోట్లు మాత్రమే కేటాయించినట్లు చూపినప్పటికీ అవసరానికి అనుగుణంగా నిధులు మంజూరుకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో పనుల వేగవంతంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్యాకేజీ-4లో కొన్ని పనులకు సంబంధించి ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదించిన రూ.183 కోట్ల అదనపు నిధుల మంజూరుకు గత నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా తొలిదశ పనుల్లో అంతర్భాగంగా ప్యాకేజీ-2, ప్యాకేజీ-4లలో అత్యవసరంగా చేయాల్సిన పనుల కొనసాగింపునకు అనుమతి ఇచ్చింది. రూ.106.39 కోట్లు మంజూరు చేసింది. ఆ పనులు చేసేందుకు మెగా ఇంజనీరింగ్‌, అలాగే ఎస్‌సీఎల్‌ కంపెనీలకు అనుమతిస్తూ మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. వాస్తవానికి ప్యాకేజీ-2 పనులను గాయత్రీ కంపెనీ చేయాలి.ప్యాకేజీ-4 పనులను ఎస్‌సీఎల్‌-బీఎస్‌సీపీఎల్‌ కంపెనీలు జాయింట్‌ వెంచర్‌తో చేయాల్సి ఉంది. ప్యాకేజీ-2లో అత్యవసరమైన తీగలేరు హెడ్‌ రెగ్యులేటరీ గేట్ల ఏర్పాటు, ఆ కాలువలోని టెన్నెల్‌ లైనింగ్‌, ఫీడర్‌ కాలువ కలిపి సుమారు రూ.68 కోట్ల పనులను చేయకుండా సదరు కంపెనీ పెండింగ్‌లో పెట్టింది. ప్యాకేజీ-4లోని తూర్పు ప్రధాన కాలువ హెడ్‌రెగ్యులేటరీ నిర్మాణం, గేట్ల ఏర్పాటు ఇతరత్రా సుమారు రూ.38 కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. జాయింట్‌ వెంచర్‌లో ఉన్న ఒక కంపెనీ ముందుకు రాక ఆగిపోయాయి. దీంతో పనులు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు చొరవ చూపి వెలిగొండ ప్రాజెక్టులో ఇతర పనులు చేస్తున్న మెగా, అలాగే ఎస్‌సీఎల్‌ కంపెనీలతో మాట్లాడి పెండింగ్‌ పనులు చేసేలా ఒప్పించారు. ఆ ప్రకారం ప్యాకేజీ-2లో పెండింగ్‌లో ఉన్న రూ.68 కోట్ల పనులను మెగా కంపెనీకి, ప్యాకేజీ-4లో పెండింగ్‌ పనులు జాయింట్‌ వెంచర్‌లోని ఎస్‌సీఎల్‌ చేసేందుకు అంగీకరించి కొంత పని కూడా చేపట్టారు. ఈనేపథ్యంలో ఆ రెండు ఏజెన్సీలకు రూ.106.39 కోట్ల విలువైన పనులు చేసేందుకు అనుమతిస్తూ మంత్రివర్గం తీర్మానించింది. దీంతో వెలిగొండ తొలిదశ పనుల్లో మరో ముందడుగు పడినట్లు అయింది.

Updated Date - Apr 16 , 2025 | 02:25 AM