Share News

లోకేష్‌ చొరవతోనే బయోగ్యాస్‌ ప్లాంట్‌

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:19 AM

కనిగిరి నియోజకవర్గ ప్రజల దృష్టిలో యువనాయకులు నారా లోకేష్‌ ముఖ్య మంత్రితో సమానం అని శాసనసభ్యుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. ఎడారిని తలపింపజేసే తమ ప్రాంతంలో రిలయన్స్‌ సంస్థ ద్వారా బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆయన తీసుకున్న చొరవ అందుకు కారణమైందని చెప్పారు.

లోకేష్‌ చొరవతోనే బయోగ్యాస్‌ ప్లాంట్‌

దానితోనే పారిశ్రామిక అభివృద్ధికి పునాది

ఈ ప్లాంట్‌తో ఎటువంటి కాలుష్యం ఉండదు

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

కనిగిరి నియోజకవర్గ ప్రజల దృష్టిలో యువనాయకులు నారా లోకేష్‌ ముఖ్య మంత్రితో సమానం అని శాసనసభ్యుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. ఎడారిని తలపింపజేసే తమ ప్రాంతంలో రిలయన్స్‌ సంస్థ ద్వారా బయోగ్యాస్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆయన తీసుకున్న చొరవ అందుకు కారణమైందని చెప్పారు. బుధవారం నియోజకవర్గంలో బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసే కార్యక్రమంలో లోకేష్‌తోపాటు రిలయన్స్‌ సంస్థ అధిపతుల్లో ఒకరైన అనంత్‌ అంబానీ కూడా పాల్గొంటున్నారని వివరించారు. స్వాతంత్య్రం అనంతరం ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమకు కూడా నోచుకోని నియోజకవ ర్గంలో పరిశ్రమల స్థాపనకు పునాది పడుతున్నదంటే అందుకు మంత్రి లోకేషే ప్రధాన కారకులని చెప్పారు. తనతోపాటు నియోజకవర్గ ప్రజలు లోకేష్‌కు కృతజ్ఞులమై ఉంటామని ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. బయోగ్యాస్‌ ప్లాంట్‌ వలన ఎలాంటి కాలుష్యం ఉండదని స్పష్టం చేశారు.

ఈ ప్లాంటు వలన పొల్యూషన్‌ ఎదురుకావచ్చు కదా?

జీరో బేస్డ్‌ పొల్యూషన్‌ యూనిట్‌గా బయో గ్యాస్‌ ప్లాంట్‌ పనిచేస్తుంది. ఈ విషయం ఇప్పటికే నిర్ధారణ కూడా అయ్యింది. పరిశ్రమ రాకను చూసి ఓర్వలేక కొంతమంది వదంతులు పుట్టిస్తున్నారు.

పొగ అధికంగా వచ్చే అవకాశం లేదా?

కాలుష్యం లేని విధంగా పర్యావరణ హిత యూనిట్‌ నిర్మాణం జరుగుతోంది. ప్లాంట్‌ నిర్మాణ ప్రాంతం, చుట్టుపక్కల అంతా పచ్చిక బయళ్ల పెంపకం ద్వారా మంచి వాతావా రణం కూడా ఏర్పడబోతోంది.

యూనిట్‌ నిర్మాణానికి ఎంత వ్యయం చేయనున్నారు?

రూ.130 కోట్ల వ్యయంతో ఈ యూనిట్‌ నిర్మాణం జరగనుంది.

రైతుల సాగు భూములు దెబ్బతినవా?

రైతుల భూముల్లో యూనిట్‌కు అవసర మైన గడ్డి పెంపకాన్ని రిలయన్స్‌ సంస్థ ప్రోత్స హిస్తుంది. విత్తనాలు, సాంకేతిక సహకారం ఇవ్వడంతోపాటు రైతుల సొంత భూమి అయితే ఎకరాకు ఏడాదికి రూ.31వేలు కౌలు కూడా చెల్లిస్తుంది. అసైన్డ్‌ భూమి అయితే ఎకరాకు రూ.15 వేలు ఇస్తుంది.

ఇలాంటి పరిశ్రమలు ఇంకా వచ్చే అవకాశం ఉందా?

హెలికాప్టర్‌ పరికరాలు తయారుచేసే ఒక సంస్థ ముందుకు వచ్చి భూమి కేటాయింపు కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది, మరోవైపు సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ను సీఎస్‌పురం మండలంలో ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పరిశ్రమల స్థాపనకు నాంది పడుతున్నందున, అపారంగా ప్రభుత్వ భూములు ఉన్నందున మరికొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

Updated Date - Apr 01 , 2025 | 01:19 AM