Share News

నిబద్ధతకు పట్టం

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:15 AM

మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారు.. ప్రత్యేకించి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కష్టించిన వారికి గుర్తింపు దక్కింది. ఇంకా గతంలో ఏదో స్థాయిలో పదవులు నిర్వహించిన వారికే అధికార తెలుగుదేశం పార్టీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్ల పదవులను కట్టబెట్టింది.

నిబద్ధతకు పట్టం
మద్దిపాడు, దర్శి, కనిగిరి, కంభం ఏఎంసీ చైర్మన్‌లు రాజేశ్వరి, నాగవేణి, రమాదేవి, భూపాల్‌రెడ్డి

పార్టీలో కష్టపడి పనిచేసిన వారికే ఏఎంసీ చైర్మన్‌ పదవులు

సామాజిక సమతూకానికీ ప్రాధాన్యం

ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన కొత్త వారికి నిరాశ

ఇప్పటికే పదింటికి ఖరారు

బీసీలకు మూడు, ఎస్సీలకు ఒకటి, జనరల్‌కు ఐదు కేటాయింపు

మిగిలిన ఐదులో ఎస్సీలకు రెండు, బీసీలకు ఒకటి, ఓసీలకు రెండు ఇచ్చే అవకాశం

ఉమ్మడి జిల్లాలో నియామకాల తీరుతెన్ను ఇదీ

మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారు.. ప్రత్యేకించి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కష్టించిన వారికి గుర్తింపు దక్కింది. ఇంకా గతంలో ఏదో స్థాయిలో పదవులు నిర్వహించిన వారికే అధికార తెలుగుదేశం పార్టీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చైర్మన్ల పదవులను కట్టబెట్టింది. అందులోనూ సామాజికవర్గాల సమతూకానికి ప్రాధాన్యమిచ్చింది. ఆపై మహిళలకు పెద్దపీట వేసింది. ఉమ్మడి జిల్లాలో ఏడు మార్కెట్‌ కమిటీల చైర్మన్‌ పదవులకు అధిష్ఠానం శుక్రవారం పేర్లు ఖరారు చేసింది. గతంలోనే మూడు ఏఎంసీలకు ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో పది మార్కెట్‌ కమిటీ చైర్మన్ల ఎంపిక పూర్తయ్యింది. వివిధ కారణాలతో మరో ఐదు కమిటీల ఎంపికను వాయిదా వేసినప్పటికీ రానున్న వారంలో వాటి నియామకాలు పూర్తికానున్నాయి.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉండగా తొలుత గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి కమిటీలకు చైర్మన్ల పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. శుక్రవారం కంభం, దర్శి, కనిగిరి, సంతనూతలపాడు, సంతమాగులూరు, పర్చూరు, చీరాల మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌ల పేర్లను ప్రకటించింది. వీరి నియామకపత్రాలు అధికారికంగా నేడో, రేపో వచ్చే అవకాశం ఉంది. ఒంగోలు, కొండపి, ఎర్రగొండపాలెం, కందు కూరు ఏఎంసీలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. శుక్రవారం ఖరారైన కమిటీల్లో కనిగిరికి యారం రమాదేవి, దర్శికి దారం నాగవేణి, మద్దిపాడుకు మన్నం రాజేశ్వరి, కంభంకు పూనూరు భూపాల్‌రెడ్డి, పర్చూరుకు గుంజి వెంకటరావు, చీరాలకు కేసవరపు జనార్దన్‌రావు, సంతమాగులూరుకు టి.రమేష్‌ ఉన్నారు. అంతకుముందు మార్కాపురానికి ఎం.వెంకటరెడ్డి, గిద్దలూరుకు పి. బాలయ్య, అద్దంకికి పద్మావతి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. ఇలాంటి పదవులకు ఆయా నియోజకవర్గాల అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ఇచ్చిన పేర్లను యఽథాతథంగా ఆమోదించడం ఇప్పటి వరకూ జరిగింది. కానీ ప్రస్తుతం అధికార టీడీపీ ప్రత్యేకించి నారా లోకేష్‌ ఆ విధానానికి తిలోదకాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు సూచించిన పేర్లను వెనక్కు పంపి గత ఎన్నికలకు ముందు, పార్టీలో బూత్‌స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడైనా కీలక బాధ్యతలు నిర్వహించిన వారు, అందులోను గత ఎన్నికల్లో కూటమి పార్టీల గెలుపుకోసం కీలకంగా పనిచేసిన వారి పేర్లు సూచించాలని కోరారు. ఈ విషయమై మంత్రి నారా లోకేష్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు మౌఖికంగా నిర్ధిష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు తమకు ఆర్థిక సహకారం అందించారంటూ కొత్త పేర్లు సిఫార్సు చేసినా తిరస్కరించారు. ప్రస్తుతం ఎంపికైన పదిమందిని పరిశీలిస్తే అధిష్ఠానం చెప్పిన కోవకు చెందిన వారు కావటమే విశేషం. చివరకు చైర్మన్లుగా ఎంపికైన మహిళలకు సంబంధించి కూడా వారు గానీ వారి భర్త లేక తండ్రి పార్టీలో కీలకంగా వ్యవహరించి ఉంటేనే అవకాశం కల్పించారు. మూడు ఏఎంసీ చైర్మన్ల పదవులకు సంబంధించి ఎమ్మెల్యేల సిఫార్సులను వెనక్కు పంపి తిరిగి కొత్త పేర్లు తెప్పించుకొని పార్టీలో పనిచేసిన వారు అనే అర్హత ఆధారంగా ఎంపిక చేశారని తెలిసింది.

మహిళలు, బీసీలకు ప్రాధాన్యం

ఇప్పటికీ ఖరారైన చైర్మన్‌ పదవుల్లో నాలుగు మహిళలు, మూడు బీసీల దక్కాయి. మహిళల్లో అద్దంకి నుంచి దళితుల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన పద్మావతిని ఎంపిక చేశారు. ఆమె తండ్రి నాగేశ్వరరావు ఆ నియోజకవర్గంలో తొలి నుంచి పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీలు మారినా సరే ఆయన మాత్రం పార్టీకే నిబద్ధతతో పనిచేశారు. దర్శి నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన దారం నాగవేణిని ఎంపిక చేశారు. ఆమె ప్రస్తుతం కౌన్సిలర్‌ కూడా. ఆమె భర్త సుబ్బారావు దర్శి పట్టణ టీడీపీ నాయకుడిగా చాలాకాలం పనిచేశారు. మద్దిపాడు చైర్మన్‌గా ఎంపికైన రాజేశ్వరి భర్త ప్రసాద్‌ చీమకుర్తి మండలంలో పార్టీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. కనిగిరి చైర్మన్‌గా ఎంపికైన రమాదేవి భర్త శ్రీనివాసులు గత ఎన్నికల్లో టీడీపీ పక్షాన కీలకంగా పనిచేశారు. ఆయన తోడళ్లుడు జనార్దన్‌ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. బీసీల్లో గిద్దలూరు నుంచి యాదవ సామాజికవర్గానికి చెందిన బాలయ్య, చీరాల నుంచి జనార్దన్‌రావు, పర్చూరు నుంచి వెంకటరావు ఎంపిక కాగా ముగ్గురు టీడీపీలో పాతకాపులే. మార్కాపురం నుంచి ఎంపికైన వెంకటరెడ్డి గతంలో బూత్‌ కన్వీనర్‌గా, గత ఎన్నికల్లో క్లష్టర్‌ ఇన్‌చార్జిగా పనిచేశారు. కంభం నుంచి ఎంపికైన భూపాల్‌రెడ్డి 2014 టీడీపీకి చేసి, 2019 వైసీపీలోకి వెళ్లినా ఆ వెంటనే టీడీపీలోకి వచ్చారు. టీడీపీకి అండగా పార్టీ బాధ్యతలు నిర్వహించారు. సంతమాగులూరు చైర్మన్‌గా ఎంపికైన కుందుర్తి గ్రామంకు చెందిన టి.రమేష్‌ ఒకప్పుడు కరణం బలరాంతో ఉన్నా ప్రస్తుతం మంత్రి రవికుమార్‌ వద్దకు వచ్చిన తర్వాత పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం బాపట్ల జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. బలహీనవర్గాల నుంచి పర్చూరు చైర్మన్‌గా ఎంపికైన వెంకటరావు మాజీ మంత్రి, వైసీపీ నాయకులు గాదె వెంకటరెడ్డి స్వగ్రామమైన పావులూరులో టీడీపీ పక్షాన పనిచేస్తూ గతంలో ఒకసారి జడ్పీటీసీగా పనిచేశారు. చీరాలకు చెందిన జనార్దన్‌రావు కూడా టీడీపీ బిసీసెల్‌ రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు.


త్వరలో మిగిలినవి ప్రకటన

మిగిలిన ఏఎంసీల్లో ఒంగోలు చైర్మన్‌ పదవిని బీసీలకు కేటాయించారు. ఎమ్మెల్యే జనార్దన్‌ నుంచి ఇంకా ప్రతిపాదన వెళ్లక ఎంపిక జరగలేదు. కొండపి చైర్మన్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించారు. మంత్రి స్వామి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యలు అభ్యర్థి ఎంపిక విషయంలో తికమకపడుతున్నట్లు తెలిసింది. ఎర్రగొండపాలెం ఏఎంసీ చైర్మన్‌ పదవిని ఓసీ జనరల్‌కు కేటాయించారు. పార్టీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన మూడు పేర్లు పంపి అధిష్టానాన్నే తుది నిర్ణయం తీసుకోమని కోరినట్లు సమాచారం. పొదిలి చైర్మన్‌ పదవిని బీసీ మైనారిటీకి కేటాయించినట్లు తెలిసింది. ఎమ్మెల్యే నారాయణరెడ్డి సిఫార్సు కోసం ఎదురుచూస్తున్నారు. కందుకూరు చైర్మన్‌ పదవిని దళితులకు కేటాయించగా ఎమ్మెల్యే ఇచ్చిన పేరుపై అధిష్ఠానం పరిశీలన ప్రారంభించింది. ఈ ఐదు ఏఎంసీల చైర్మన్‌ పదవులకు వచ్చే వారంలో నియామకం జరిగే అవకాశం ఉంది.

Updated Date - Apr 05 , 2025 | 02:15 AM