వైభవంగా గుంటిగంగ తిరునాళ్ల
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:12 PM
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటిగంగ తిరునాళ్ల సోమవారం వైభవంగా జరిగింది. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. అధికసంఖ్యలో మహిళలు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు
సామాజిక వర్గాలవారీ పలు సత్రాలలో అన్నదానం
తాళ్లూరు, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటిగంగ తిరునాళ్ల సోమవారం వైభవంగా జరిగింది. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. అధికసంఖ్యలో మహిళలు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన గదులు సరిపోక ఆలయం వెనక భాగంలో, చెట్లకింద పొంగళ్లు పెట్టుకుంటూ ఎండవేడిమికి కొంత ఇబ్బందులు పడ్డారు. గంగమ్మకు పశుజాతిని బలిఇచ్చి సకాలంలో వర్షాలు కురిపించి కాపాడు అంటూ వేడుకున్నారు. భక్తులు పశుసంపదను, వాహనాలను తీసుకొచ్చి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు జరిపారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన అన్నదాన సత్రాల వద్ద వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రత్యేక పూజలు
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గంగమ్మ తల్లిని దర్శించుకునేందుకు వచ్చిన సమయంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావును ప్రత్యేక ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. చివరకు ఎలాగోలా ఎంపీపీ లోపలకు వెళ్లటంతో వివాదం సద్దుమణిగింది. జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్‌రెడ్డి, శాగం కొండారెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, మన్నేపల్లి సమర, రాచకొండ వెంకట్రావు, పిన్నిక రమేష్, వైసీపీ మండల అధ్యక్షుడు టి.సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్‌రెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి పాల్గొన్నారు.
భక్తుల పాట్లు
దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సీఐ వై.రామారావు నేతృత్వంలో ఎస్‌ఐ ఎస్.మల్లికార్జునరావు, పోలీసులు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల నిర్వహణ సక్రమంగా లేకపోవటంవల్ల ఉదయం వేళనే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆలయం వద్ద నియమించిన పోలీసులు కన్పించకపోవటం, స్థానికులం, ముఖ్యులమంటూ వెలుపలికి వెళ్లే మార్గం గుండా అధికసంఖ్యలో భక్తులను ఆలయంలోకి అనుమతించటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయంలోనుంచి బయటకురాలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నా పోలీసులు, దేవదాయ అధికారులు మిన్నకుండిపోయారు. క్యూలో గంటలకొద్దీ భక్తులు నిల్చొని ఇబ్బందులు పడ్డారు. వీరికి మంచినీరు అందక దాహార్తితో తల్లడిల్లారు. దొంగలపై, అనుమానితులపై దృష్టిసారించి ముందస్తుగా అదుపులోని తీసుకున్నారు. తిరునాళ్లలకు వచ్చిన భక్తులకు తేజా వృద్ధాశ్రమం వారు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు.