Share News

ఫోర్జరీతో హాంఫట్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 02:23 AM

మార్కాపురం ప్రాంతంలో భూమాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు, వాగులు, వంకల ఆక్రమణలను తెగబడిన అక్రమార్కులు.. ఇప్పుడు రిజిస్టర్డ్‌ పట్టా భూములను కూడా వదలడం లేదు. చివరికి తహసీల్దార్‌, వీఆర్వోల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి పట్టా భూములకు నివేశన స్థల ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. వాటిని పల్నాడు జిల్లా వినుకొండలో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారు.

ఫోర్జరీతో హాంఫట్‌

దొంగ సంతకాలతో ప్రైవేటు స్థలానికి ఇంటి పట్టాలు

రూ.కోటి విలువైన భూమిని కాజేసేందుకు యత్నం

యజమాని ఫిర్యాదుతో అప్రమత్తమైన రెవెన్యూ

పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దారవీడు తహసీల్దార్‌

మార్కాపురం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం ప్రాంతంలో భూమాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు, వాగులు, వంకల ఆక్రమణలను తెగబడిన అక్రమార్కులు.. ఇప్పుడు రిజిస్టర్డ్‌ పట్టా భూములను కూడా వదలడం లేదు. చివరికి తహసీల్దార్‌, వీఆర్వోల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి పట్టా భూములకు నివేశన స్థల ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. వాటిని పల్నాడు జిల్లా వినుకొండలో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కి రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో అవాక్కయ్యారు. వాస్తవానికి ప్రభుత్వం మంజూరు చేసిన నివేశన స్థల ధ్రువీకరణ పత్రాలకు కూడా రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీల్లేదు. అయినా కాసుల కక్కుర్తితో అధికారులు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ అక్రమ తంతు డివిజన్‌లోని పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో చోటుచేసుకుంది. పట్టా భూముల యజమానుల ఫిర్యాదుతో ప్రస్తుతం రెవెన్యూ అధికారులు నివేదిక తయారుచేసి పోలీసుస్టేషన్‌లో అందజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు.

రూ.కోటి విలువైన భూమిని కొట్టేసేందుకు కుటిల యత్నం

పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలోని సర్వేనంబర్‌ 213లో సంగు రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తికి 13 సెంట్ల భూమి ఉంది. 2011లో దాన్ని దేవరాజుగట్టు గ్రామస్థుల నుంచి కొనుగోలు చేశాడు. ఆ భూమి జాతీయ రహదారి 544ని ఆనుకుని ఉండటంతో మార్కెట్‌ విలువ ప్రకారం రూ.కోటిపైనే ఉంది. ఎలాగైనా దాన్ని కాజేయాలని మండల కేంద్రమైన పెద్దారవీడు చెందిన విద్యుత్‌ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగి పథకం పన్నాడు. దొంగపత్రాలు సృష్టించి ఎలాంటి భూమినైనా కాజేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అనుకున్నదే తడవుగా పెద్దారవీడు తహసీల్దార్‌ దాసు సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. 2024 ఫిబ్రవరిలో జారీ చేసినట్లుగా మండల కేంద్రానికి చెందిన దుగ్గెం భాస్కర్‌, వేశపోగు అచ్చమ్మ, ఆరవీటి కొండయ్య అనే ముగ్గురికి ఒక్కొక్కరి 120 గజాల చొప్పున నివేశన స్థల పట్టాలు తయారు చేశాడు. వాటిని చూపించి పల్నాడు జిల్లా వినుకొండ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించాడు. అందుకు అవసరమైన వీఆర్వో ధ్రువీకరణపత్రాన్ని కూడా ఫోర్జరీ సంతకాలతో తయారు చేశాడు. అనంతరం ఆ భూమిలోకి వెళ్లి శుభ్రం చేస్తున్న క్రమంలో భూయజమాని రాజశేఖర్‌రెడ్డి అడ్డుకోవడంతో అక్రమం బహిర్గతమైంది.


భూయజమాని ఫిర్యాదుతో కదిలిన డొంక

దొంగ రిజిస్ట్రేషన్‌ పత్రాలతో భూమిలోకి ప్రవేశించిన సదరు మండల కేంద్రానికి చెందిన ముగ్గురు తొలుత భూయజమానిపై దౌర్జన్యానికి దిగారు. భూయజమాని ఆ రిజిస్ట్రేషన్‌ పత్రాలను తీసుకుని తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి మొత్తం రికార్డులను పరిశీలించారు. నివేశన స్థల పత్రాలు దొంగవి సృష్టించినట్లు నిర్థారించుకుని తొలుత వీఆర్వో భాస్కర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వాటిని పూర్తిగా పరిశీలించిన వీఆర్వో భాస్కర్‌రెడ్డి ఒక నివేదికను తయారుచేసి తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌కు ఇచ్చారు. స్థల ధ్రువీకరణ పత్రంలో 2024 ఫిబ్రవరి 30న పట్టాను తయారు చేసినట్లు ఉంది. అంతేకాక 2024 ఫిబ్రవరిలో పనిచేసిన తహసీల్దార్‌ సంతకం కూడా తేడాగా ఉంది. రిజిస్ట్రేషన్‌ కోసం సృష్టించిన వీఆర్వో ధ్రువీకరణ పత్రంలో కూడా ఎన్‌.భాస్కర్‌రెడ్డి బదులు జి.భాస్కర్‌రెడ్డి అని వీఆర్వో సంతకాన్ని చేశారు. వీటన్నింటినీ పేర్కొంటూ దొంగ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ శైలేంద్రకుమార్‌ దేవరాజుగట్టు పోలీసు స్టేషన్‌కు మంగళవారం ఫిర్యాదును పంపారు. దీనిపై ఎస్సై అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా తాను మార్కాపురంలో క్రైం మీటింగ్‌లో ఉన్నానని చెప్పారు. స్టేషన్‌కు వెళ్లిన తర్వాత పరిశీలించి కేసు నమోదు చేస్తానని తెలిపారు.

Updated Date - Apr 16 , 2025 | 02:23 AM