పింఛన్ సొమ్ము మాయం
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:20 AM
మండలంలోని కేతగుడిపి, బుడ్డపల్లెకు సంబంధించిన పింఛన్ల సొమ్ము రూ.15.36లక్షలు మాయమయ్యాయి. ఈమేరకు వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన కేతగుడిపి వెల్ఫేర్ అసిస్టెంట్
తర్లుపాడు, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కేతగుడిపి, బుడ్డపల్లెకు సంబంధించిన పింఛన్ల సొమ్ము రూ.15.36లక్షలు మాయమయ్యాయి. ఈమేరకు వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 407 పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి రూ.17.78 లక్షలను శనివారం మధ్యాహ్నం వెల్ఫేర్ అసిస్టెంట్ మార్కా పురం డ్రా చేశారు. కేతగుడిపిలో పంపిణీ చేసేందుకు అక్కడి డిజిటల్ అసిస్టెంట్ ఎ.సతీష్‌రెడ్డికి రూ.2.42లక్షలు బ్యాంకు వద్ద అందజేశారు. మిగిలిన రూ.15.36లక్షలు తీసుకుని ఇంటికి వెళ్తుండగా ఆటోలో మర్చిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడు రోజుల నుంచి నగదు పోయిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా వెల్ఫేర్ అసిస్టెంట్ జాగ్రత్త పడ్డారు. మంగళవారం ఉదయం కేతగుడిపిలో పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 10 గంటల వరకు ప్రారంభించలేదు. దీంతో జిల్లా అధికారుల నుంచి ఎంపీడీవోకు ఫోన్ వచ్చింది. ఆయన ఎందుకు పంపిణీ చేయలేదని వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికను అడిగారు. శనివారం ఆటోలో నగదు పోయినట్లు ఎంపీడీఓవోకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వెల్ఫేర్ అసిస్టెంట్ ఉదయం 11 గంటలకు మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు...?
రూ.15.36లక్షలు నగదు ఆటోలోపోతే మంగళవారం వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదంటూ పోలీసులు వెల్ఫేర్ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు. బ్యాంకులో ఎన్ని గంటలకు నగదు డ్రా చేసింది, ఎన్ని గంటలకు ఆటోలో వెళ్లింది, ఎన్ని గంటలకు ఇంటికి వెళ్లిందన్న విషయమై ఆరా తీశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. సీసీ టీవీల ఫుటేజీని పరిశీలిస్తున్న ఆయన చెప్పారు.
నగదు పోయిన విషయం నాకు చెప్పలేదు : చక్రపాణి ప్రసాద్, ఎంపీడీవో
పింఛన్ల నగదు మూడు రోజుల క్రితం ఆటోలో పోతే తనకు ఉదయం వరకు సమాచారం ఇవ్వలేదని ఎంపీడీవో చక్రపాణి ప్రసాద్ తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. డీఆర్‌డీఏ నుంచి మరోసారి నగదు విడుదలైన వెంటనే కేతగుడిపి, బుడ్డపల్లెకు పింఛన్లు పంపిణీ చేస్తామని ఎంపీడీవో పేర్కొన్నారు.
పింఛన్ల సొమ్ము కోసం వృద్దుల ఎదురుచూపులు
కేతగుడిపి, బుడ్డపల్లెకు సంబంధించిన పింఛన్ల నగదు మాయం కావడంతో డబ్బులు ఎప్పుడు ఇస్తారో అంటూ వృద్దులు, దివ్యాంగులు ఎదురుచూస్తున్నారు. అసలు ఈ నెల పింఛన్లు వస్తాయా..? లేదా..? అంటూ ఆందోళన చెందుతున్నారు.