Share News

కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు!

ABN , Publish Date - Mar 13 , 2025 | 02:34 AM

జిల్లా పరిపాలన భవన్‌(కలెక్ట రేట్‌)కు రెండు గేట్లు మూసివేసినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు దూసుకొని లోపలికి వెళ్లారు. ఊహించని ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యువత పోరు పేరుతో వైసీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు.

కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు!
కలెక్టరేట్‌లోకి వెళ్తున్న వైసీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

గేట్లు వేసినా నెట్టుకొని వెళ్లిన వైసీపీ నాయకులు

అదుపు చేయలేకపోయిన పోలీసులు

లోపల అడ్డుకొని కొద్దిమందికే వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పరిపాలన భవన్‌(కలెక్ట రేట్‌)కు రెండు గేట్లు మూసివేసినా వైసీపీ నాయకులు, కార్యకర్తలు దూసుకొని లోపలికి వెళ్లారు. ఊహించని ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. యువత పోరు పేరుతో వైసీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్‌ పాఠశాల నుంచి నెల్లూరు బస్టాండు మీదుగా చర్చిసెంటర్‌, అక్కడి నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు ముందుగానే బయటి నుంచి కలెక్టరేట్‌లోకి వెళ్లే రెండు గేట్లను మూసివేశారు. వాటి వద్ద పోలీసులు తక్కువ మంది ఉన్నారు. దీంతో ఒక్కసారిగా గేట్లను వైసీపీ నాయకులు, కార్యకర్తలు తోసివేసి లోపలికి వెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. వెంటనే టూటౌన్‌, వన్‌టౌన్‌ సీఐలు వచ్చి ప్రకాశం భవన్‌ లోపల వారందరినీ అడ్డుకున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు మాత్రమే కలెక్టర్‌ను కలిసేందుకు అవకాశం కల్పించారు. మిగిలిన వారందరినీ బయటకు పంపి రెండు ప్రధాన గేట్లను మూసివేశారు. కాగా ఒక దశలో కలెక్టరేట్‌ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Updated Date - Mar 13 , 2025 | 02:34 AM