పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 13 , 2025 | 02:32 AM
జిల్లాలో ఈనెల 17 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మకంగా గుర్తించిన పరీక్షా కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలో 183 కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిల్లో ఆరు సున్నితమైన, సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.

సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
సీసీ కెమెరాలు ఏర్పాటు
ఒంగోలు విద్య, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈనెల 17 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మకంగా గుర్తించిన పరీక్షా కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలో 183 కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిల్లో ఆరు సున్నితమైన, సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిలో బేస్తవారపేట మండలం పిటికాయ గుళ్ల, పెద్దారవీడు మండలం వైడిపాడు, అర్ధవీడు మండలం మాచవరం, రాచర్ల, సీఎస్‌పురం జడ్పీ హైస్కూళ్లు, కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కేంద్రాలు ఉన్నాయి. ఇంటర్ పరీక్షల తరహాలోనే ఈ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఒంగోలులోని డీఈవో కార్యాలయం, విజయవాడలోని పాఠశాల విద్య కమిషనర్ కార్యాలయానికి అనుసంధానం చేస్తున్నారు. ఈ రెండు చోట్ల నుంచి అధికారులు పరీక్ష జరుగుతున్న తీరును నేరుగా సమీక్షించవచ్చు. అదేవిధంగా ప్లయింగ్ స్క్వాడ్‌లు, అధికారుల బృందాలు ఈ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు.