Share News

ట్రిపుల్‌ ఐటీలో దాహం కేకలు..!

ABN , Publish Date - Apr 07 , 2025 | 11:27 PM

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. మూడు రోజుల నుంచి కాలేజీ క్యాంపస్‌లో నీరు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. పట్టించుకోవాల్సిన కాలేజీ ఏవో, డైరెక్టర్లు ప్రభుత్వ సెలవుల పేరు చెప్పి పత్తా లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు

ట్రిపుల్‌ ఐటీలో దాహం కేకలు..!
నీటి సంపును పరిశీలిస్తున్న కమిషనర్‌ వెంకటేశ్వరరావు

మూడు రోజులుగా నీటి కోసం అగచాట్లు

పట్టించుకోని కాలేజీ అధికారులు

ఎమ్మెల్యే దామచర్ల ఆదేశాలతో

కదిలిన కార్పొరేషన్‌ అధికారులు

ఒంగోలు, కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 7 (ఆంఽధ్రజ్యోతి) : ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. మూడు రోజుల నుంచి కాలేజీ క్యాంపస్‌లో నీరు లేకపోవడంతో అల్లాడిపోతున్నారు. పట్టించుకోవాల్సిన కాలేజీ ఏవో, డైరెక్టర్లు ప్రభుత్వ సెలవుల పేరు చెప్పి పత్తా లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళితే.. ఒంగోలులోని దక్షిణ బైపాస్‌ రోడ్‌లోని ఆర్‌జీయూకేటీ క్యాంపస్‌-3లో విద్యుత్‌ మోటార్లు కాలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. మరోవైపు పదేపదే విద్యుత్‌ సమస్య వేధిస్తోంది. కొన్ని బ్లాక్‌లలో ఫ్యాన్లు పనిచేయడం లేదు. నీటి సమస్య కారణంగా మూడు రోజులకు ఒకసారి కూడా స్నానం చేసే పరిస్థితి లేదు. ప్రత్యేకించి ఆదివారం శ్రీరామనవమి పండుగ రోజు కూడా నీటి కోసం అల్లాడిపోయారు. మూడు రోజులుగా తాము ఎదుర్కొంటున్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా శని, ఆదివారాలలో వారు సెలవు పేరుతో అందుబాటులో లేరు. దీంతో సోమవారం నిరసనకు దిగారు.

ఎమ్మెల్యే దామచర్ల ఆదేశాలతో కదిలిన కార్పొరేషన్‌ అధికారులు

ట్రిపుల్‌ ఐటీలో సమస్యలు, విద్యార్థులు పడుతున్న అవస్థలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ వెంటనే స్పందించారు. నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. దీంతో నగర కమిషనరు కె.వెంకటేశ్వరరావు, ఎంఈ చంద్రయ్యతోపాటు పలువురు ఇంజనీరింగ్‌ అధికారులు ట్రిపుల్‌ ఐటీ కాలేజీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యకు గల కారణాలు గుర్తించిన వారు తక్షణమే కార్పొరేషన్‌కుచెందిన ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయించారు. కాలేజీలోని సంప్‌లో నీటిని నిల్వ చేయించారు. అలాగే పాడైపోయిన మోటార్లకు వెంటనే మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని కమిషనరు విద్యార్థులకు హామీ ఇచ్చారు. అలాగే కాలేజీలోని సమస్యలను ఎమ్మెల్యేకు దామచర్లకు వివరించడంతోపాటు, ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

Updated Date - Apr 07 , 2025 | 11:27 PM