పొగాకును ఎప్పటికప్పుడు అమ్ముకోవాలి
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:56 AM
పొగాకు పండించిన రైతులు త్వరగా పొగాకును వేలంలో ఉంచి అమ్ముకోవాలని పొగాకుబోర్డ్ చైర్మన్ యస్వంత్‌కుమార్ అన్నారు. శుక్రవారం వేలం నిర్వహణ అధికారి గిరిరాజ్‌కుమార్ అధ్యక్షతన పొదిలి పొగాకుబోర్డ్‌ను సందర్శించారు

పొదిలిలో వేలం కేంద్రాన్ని సందర్శించిన చైర్మన్ యశ్వంత్‌కుమార్
పొదిలి, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : పొగాకు పండించిన రైతులు త్వరగా పొగాకును వేలంలో ఉంచి అమ్ముకోవాలని పొగాకుబోర్డ్ చైర్మన్ యస్వంత్‌కుమార్ అన్నారు. శుక్రవారం వేలం నిర్వహణ అధికారి గిరిరాజ్‌కుమార్ అధ్యక్షతన పొదిలి పొగాకుబోర్డ్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటలో ఏగ్రేడ్ అయితే మార్కెట్‌లో గిరాకీ ఉండి మంచి ధరకు అమ్ముకోవచ్చన్నారు. బేళ్లు కట్టేటప్పుడు వ్యర్ధాలను రానివ్వకుండా, నాణ్యతను మరిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంచి పొగాకును వేలం కేంద్రానికి తీసుకురావాలని కోరారు. నాణ్యత లేని పొగాకు వేలానికి తీసుకురావడం రైతులకు సరైన ధర లభించదన్నారు. మనం కర్నాటక మార్కెట్ వలన కొనుగోళ్లల్లో 10 నుంచి 15 రోజులు వెనుబడి ఉన్నామన్నారు. అంతేకాకుండా బర్లీపొగాకు కూడా బ్యారన్ పొగాకుతో పోటీగా పండించారన్నారు. అంతర్జాతీయంగా పొగాకు కొనుగోళ్లలో ఒడిదుడుకులు ఉంటాయని చెప్పారు. గతంలో అనుకున్నదాని కంటే ఎక్కువగా పండించినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోనుగోలు చేసేందుకు సహకరించామన్నారు. అయితే ఈ ఏడాది పొగాకుసాగు తగ్గించాలని ముందుగా అవగాహన కల్పించినా, రైతులు అధికంగా పండించారన్నారు. దీంతో డిమాండ్ తగ్గుతుందన్నారు. ధరల పెరుగుతాయన భావన వీడి అన్నదాతలు ఎప్పటికప్పుడు అమ్ముకోవాలని సూచించారు. ఈఏడాది పెరిగిన కూలీలు, ఖర్చులకు అనుకూలంగా సరాసరి క్వింటా రూ.30వేలు ధర ఉంటేనే రైతులకు గిట్టుబాటు ఉంటుందని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అనుకూలమైన ధరలు వచ్చే విధంగా వ్యాపారులతో చర్చించి మంచిధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా పొగాకు పండిచే దేశాలతో పోటీగా పొగాకును పండిస్తున్నామన్నారు. ముందుగా వేలంలో పాల్గొని ధరలు ఎలా ఉన్నాయోనని పరిశీలించారు. అనంతరం పొగాకు నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ బ్రహ్మయ్య, రైతు సంఘనాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.