Share News

Vishva Hindu Parishad : ఆలయాల రక్షణకు దీక్ష!

ABN , Publish Date - Jan 06 , 2025 | 03:20 AM

హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలని ‘హైందవ శంఖారావం’ సభ పిలుపిచ్చింది. దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని.. ఆలయాలకు రక్షణ కల్పించాలని..

Vishva Hindu Parishad : ఆలయాల రక్షణకు దీక్ష!

  • పార్టీలు, ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించాలి

  • హైందవ శంఖారావం తీర్మానం

  • 12 అంశాలతో డిక్లరేషన్‌

  • బెజవాడ సమీపంలో వీహెచ్‌పీ భారీ బహిరంగ సభ

  • తరలివచ్చిన స్వామీజీలు, సాధు సంతులు

  • మన ధర్మానికి దేవాలయాలే మూలస్తంభాలు

  • స్వయంప్రతిపత్తి కావాలి.. అన్యమత ఉద్యోగులను తొలగించాలి

  • హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్టు బోర్డుల్లో నియమించాలి

  • గతంలో విదేశీయుల నుంచి గుళ్లను కాపాడుకున్నాం

  • స్వాతంత్య్రం వచ్చాక మాత్రం రక్షించుకోలేకపోతున్నాం

  • సనాతన ధర్మ రక్షణకు హిందువులు నడుం బిగించాలని పిలుపు

దైవనివాసాలైన ఆలయాలు దేదీప్యమానంగా దేశమంతా వెలుగొందాలంటే అయోధ్య రామ మందిరం తరహాలో ప్రభుత్వాల పెత్తనం లేకుండా హిందువులే భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వాతావరణం రావాలి.

- ‘అయోధ్య’ కోశాధికారి

గోవిందదేవ్‌ గిరిజీ మహరాజ్‌

అమరావతి, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలని ‘హైందవ శంఖారావం’ సభ పిలుపిచ్చింది. దేవాలయాలకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని.. ఆలయాలకు రక్షణ కల్పించాలని.. వాటిలో అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలని తీర్మానించింది. సనాతన ధర్మ పరిరక్షణ, పూర్వ వైభవ పునరుద్ధరణ పేరుతో ఆదివారం విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భారీ సంఖ్యలో హిందువులు తరలివచ్చారు. విదేశీయుల పాలనలోనూ ఆలయాలను రక్షించుకున్నామని, కానీ స్వాతంత్ర్యానంతరం మాత్రం వాటిని కాపాడులేకపోతున్నామని స్వామీజీలు, సాధుసంతులు వాపోయారు. వాటి రక్షణకు హిందూ సమాజం నడుం బిగించి దీక్షపూనాలని పిలుపిచ్చారు. ఆలయాలను కాపాడి తీరాలని సభికులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు సభలో వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ ప్రసంగించారు. దేవాలయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదన్నారు. వాటిని ఆయా ప్రభుత్వాలే స్వచ్చందంగా హిందువులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

Untitled-3 copy.jpg


‘అన్ని హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి. ఆలయాల ఆదాయం నుంచి ఎండోమెంట్స్‌ విభాగానికి ఇస్తున్న 12 శాతం నిధులను హిందువులకే ఖర్చు చేయాలి. ఒకప్పుడు ఆలయాల సంరక్షణ పూర్తిగా హిందువులే చూసుకునేవారు. దేవాలయాల్లో పూజా కైంకర్యాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్వహణ చేపట్టే బాధ్యత వీహెచ్‌పీ తీసుకుంటుందా.. బ్రాహ్మణులు తీసుకుంటారా.. అని కొందరు అడుగుతున్నారు.. హిందూ సమాజం ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి దేవాలయాల సంరక్షణ తీసుకోవాలి’ అని ఆయన సూచించారు. ‘హిందువులకు అతిపెద్ద ఆలయమైన తిరుమలలో అందరూ బ్రాహ్మణులే ఉన్నారా.. కంచి పీఠంలో బ్రాహ్మణేతర హిందువులు లేరా..’ అని నిలదీశారు. వీహెచ్‌పీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మిలింద్‌ పరాండే మాట్లాడుతూ.. మన సమాజంలో శక్తిమంతమైన ఆలయాలను విదేశీయులు స్వాతంత్ర్యానికి పూర్వం చేతుల్లోకి తీసుకుంటే.. ఆ తర్వాత దురదృష్టవ శాత్తూ ప్రభుత్వాలు పెత్తనం చేస్తున్నాయన్నారు. వాటిని తిరిగి హిందూ సమాజానికి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు విన్నవించినట్లు చెప్పారు. ‘విదేశీ సంస్కృతి ప్రభావం వల్ల మన సమాజంలో సహజీవనాలు, మాదక ద్రవ్యాల వినియోగం, కుల వివక్ష, లవ్‌ జీహాద్‌ లాంటి దుర్మార్గాలు అధికమవుతున్నాయి. దేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోంది. హిందూ సమాజం ఉంటేనే దేవాలయాలను రక్షించుకుని సంస్కృతిని కాపాడుకుంటుంది’ అని పేర్కొన్నారు.

ఆలయం సంస్కృతికి ఆధార స్తంభం

‘ప్రపంచం సుఖసంతోషాలతో ఉండాలంటే విశ్వ కల్యాణం కోసం కృషి చేసే భారతదేశం సురక్షితంగా ఉండాలి.. అందుకు హిందూ ధర్మం మరింత భద్రంగా ఉండాలి..’ అని అయోధ్య రామాలయ కోశాధికారి గోవిందదేవ్‌ గిరిజీ మహరాజ్‌ అన్నారు. ‘విశ్వానికి భారతదేశం అందించిన జ్ఞానజ్యోతి.. శాస్త్రాలు, సాధువులు, గోమాత, తీర్థయాత్రలు, దేవాలయాలు అనే ఐదు కేంద్రకాలతో ఆవిర్భవించింది. దేవాలయం భగవంతుడి నివాసం. మన సంస్కృతికి ఆధార స్తంభం’ అని చెప్పారు.


తీర్మానాలివే..

విజయవాడ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): హైందవ శంఖారావ ం సభ చివరిలో నిర్వాహక కమిటీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. 12 అంశాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను వీహెచ్‌పీ కేంద్రీయ సంఘటనా కార్యదర్శి కోటేశ్వరశర్మ వేదికపై వినిపించారు. హైందవ సమాజం, సాధు సంతులు, న్యాయవేత్తలు, పీఠాధిపతుల సూచనలతో రూపొందించిన దేవాలయాల స్వయంప్రతిపత్తి కల్పన చట్టానికి సంబంధించిన ముసాయిదాను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి అందించినట్లు తెలిపారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కూడా దీనిపై చర్చించామన్నారు. ముసాయిదాను కేంద్ర ప్రభుత్వానికి సైతం అందించామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసుకునేలోపు, హైందవ సమాజం ప్రభుత్వాలపై ఏయే అంశాలపై ఒత్తిడి తీసుకురావాలో పేర్కొంటూ పలు తీర్మానాలను డిక్లరేషన్‌లో పొందుపరిచారు. ‘హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. ఆలయాల ఆస్తులు, వ్యవస్థలపై దాడులను ఖండించాలి. చట్టవిరుద్ధంగా దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వినాయకచవితి, దసరా వేడుకలకు ఆంక్షలు విధించడం తగదు. ఆలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తిశ్రద్ధలతో చేయాలి. హిందూ ఆలయాల్లో అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి. హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్టు బోర్డులో సభ్యులుగా నియమించాలి. వాటిలో రాజకీయేతర ధార్మిక వ్యక్తులకు చోటు కల్పించాలి. ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి. అన్యాక్రాంతమైన ఆస్తులను సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా స్వాధీనం చేసుకుని ఆలయాలకు అప్పగించాలి. ఆలయాల ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి. నిధులను ప్రభుత్వ కార్యకలాపాలకు మళ్లించకూడదు’ అని తీర్మానాలు చేశారు.


ఒకప్పుడు ఆలయాల్లో గురుకులాలు, గోశాలలు ఉండేవి. సాంస్కృతిక కార్యక్రమాలు, వివాహాలు, జరిగేవి. గ్రామ పెద్దలు న్యాయమైన తీర్పులు అక్కడే ఇచ్చేవారు. ప్రభుత్వాలు ప్రవేశించి ఎండోమెంట్‌ చట్టాలను రుద్ది అన్య మతస్థులను పోషిస్తున్నాయి.

- వీహెచ్‌పీ జాతీయ

అధ్యక్షుడు అలోక్‌కుమార్‌

రాజకీయ పునరావాసాలుగా ఆలయాలు: గోకరాజు

హిందూ ధర్మానికి మూల స్తంభాలైన ఆలయాలు రాజకీయ పునరావాసాలుగా మారాయని వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవలి కాలంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు కలచి వేస్తున్నాయని, వాటిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి హిందువుపైనా ఉందన్నారు. ఉద్యోగులుగా, ట్రస్టు బోర్డు సభ్యులుగా ఉన్న అన్యమతస్థులు, నాస్తికులను తొలగించాలని డిమాండ్‌ చేశారు. హిందూ దేవాలయాల విముక్తి పోరాటానికి విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం మెదటి అడుగుగా అభివర్ణించారు. ఈ సభలో త్రిదండి చినజీయర్‌ స్వామీజీ, కమలానంద భారతిస్వామి, గణపతి సచ్చిదానంద స్వామీజీ, ధర్మాచార్యులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక పెద్దలు, ఆగమ పండితులు, అర్చక స్వాములు, వీహెచ్‌పీ ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర మంత్రి సత్య కుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాష్ట్రప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ కన్వీనర్‌గా తనికెళ్ల సత్య రవికుమార్‌ వ్యవహరించారు.

Updated Date - Jan 06 , 2025 | 03:20 AM