Central Govt : ‘విపత్తు’ అధికారి అతి!
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:38 AM
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మరణం... తిరుమలలో అగ్నిప్రమాదంపై విపత్తు నిర్వహణ విభాగం అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ ఈనెల 20వ తేదీన....

తిరుమల పర్యటన కోసం హల్‌చల్
అమిత్‌షా పర్యటనకు వచ్చి హైడ్రామా
టీటీడీ అధికారులతో సమీక్ష అంటూ లేఖ
చైర్మన్ బీఆర్ నాయుడుకు సమాచారం
కేంద్రం రంగంలోకి దిగుతామనడంపై రాష్ట్ర ప్రభుత్వ విస్మయం
కేంద్ర హోం శాఖకు అభ్యంతరం
తమకే సంబంధం లేదన్న అధికారులు
విపత్తు అధికారి పర్యటన రద్దు
(అమరావతి/తిరుపతి - ఆంధ్రజ్యోతి)
‘తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మరణం... తిరుమలలో అగ్నిప్రమాదంపై విపత్తు నిర్వహణ విభాగం అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ ఈనెల 20వ తేదీన తిరుమలలో సమీక్ష నిర్వహిస్తారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి’’... అంటూ కేంద్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ రాసిన లేఖ రాష్ట్ర యంత్రాంగంలో పెను దుమారం రేపింది. ఎందుకీ సమీక్ష... ఎవరీ అధికారి... అని ఆరా తీయడంతో ఇదంతా సదరు అధికారి ‘ఓవర్ యాక్షన్’ అని స్పష్టమైంది. దీనిపై కేంద్ర హోంశాఖకు తన అభ్యంతరం వ్యక్తం చేయడం... ఆ అధికారి ‘సమీక్ష’ రద్దు కావడం జరిగిపోయింది. అత్యంత నాటకీయంగా సాగిన ఈ పరిణామం వివరాలివి...
వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత... 13వ తేదీన తిరుమలలో ఆలయం వెలుపల ఉన్న లడ్డూ కౌంటర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగింది. తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై న్యాయ విచారణకు కూడా ఆదేశించింది. కానీ... ఈ ఘటనలపై తమ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులు వచ్చాయని, ఈ నేపథ్యంలో మొత్తంగా టీటీడీలో రద్దీ నిర్వహణ (క్రౌడ్ మేనేజ్‌మెంట్), భద్రతా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్ష జరుపుతారని చెబుతూ డైరెక్టర్ ఆశిష్ గవాయ్ శుక్రవారం ఒక అధికారిక లేఖ రాశారు.
నిజానికి... టీటీడీ కేంద్రం పరిధిలోకి రాదు. అతి భారీ విషాదం చోటు చేసుకుని సీబీఐ విచారణకు లేదా కోర్టు ఆదేశిస్తే కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. ఇక్కడ అవేవీ జరగలేదు. కేంద్రంలోని ఏ విభాగమైనా సరే... నేరుగా రాష్ట్ర పరిధిలోని సంస్థలకు లేఖలు రాయకూడదు. ఏదైనా, ఏమైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే సమాచారం పంపించాలి. ఇక్కడ ఈ నిబంధన కూడా పాటించలేదు. కనీసం... టీటీడీ కార్యనిర్వహణాధికారికైనా లేఖ రాశారా అంటే అదీ లేదు. ‘మా అధికారి వస్తున్నారు. సమీక్షిస్తారు’ అంటూ టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. నిజంగానే టీటీడీలో భద్రతా ఏర్పాట్లను కేంద్రం సమీక్షించాలనుకుంటే... ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపిస్తుంది. అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి ఒక్కరే వచ్చి ఏం చూస్తారు? ఏం చేస్తారు? దీంతో ఈ వ్యవహారంపై అనేక సందేహాలు తలెత్తాయి. పైగా... తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో స్పందించింది. ఇలాంటి సమయంలో కేంద్రం రంగంలోకి దిగితే తప్పుడు సంకేతాలు వెళతాయని, టీటీడీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకూ భంగకరమనే అభిప్రాయంతో... దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులు నేరుగా కేంద్ర హోంశాఖ ముఖ్యులతో చర్చించారు. అదనపు డైరెక్టర్ సంజీవ్ కుమార్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో... అసలు విషయం బయటపడింది. తిరుమలలో సమీక్ష కోసం తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ... సంజీవ్ కుమార్ సమీక్షపై వచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లుగా కేంద్ర హోంశాఖ శనివారం రాత్రి టీటీడీ ఈవోకు అధికారిక సమాచారం పంపింది.
ఇదీ అసలు విషయం...
విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం భవన సముదాయాలను ప్రారంభించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాష్ట్రానికి చేరుకున్నారు. విపత్తు నిర్వహణ విభాగానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంజీవ్ కుమార్ కూడా విజయవాడకు వచ్చారు. పనిలోపనిగా తిరుమల వేంకటేశ్వరస్వామినీ దర్శించుకోవాలని ఆయన భావించినట్లుంది. ఈ పర్యటనపై అధికారిక ముద్ర వేసుకునేందుకే... ‘క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై సమీక్ష’ పేరుతో డైరెక్టర్ స్థాయి అధికారితో లేఖ పంపినట్లు తెలుస్తోంది. అయితే... రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలతో ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది.