Share News

వాటా కోసం వచ్చి ప్రాణాలు తీసుకుంది!

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:07 AM

తండ్రి మరణించడంతో తల్లికి వచ్చిన బీమా సొమ్ములో వాటా తీసుకోవడానికి వచ్చిన కుమార్తెను తల్లి, తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి దూషించడంతో మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో సంచలనం రేపింది

వాటా కోసం వచ్చి ప్రాణాలు తీసుకుంది!

-‘తండ్రి’ బీమా సొమ్ములో వాటా అడిగిన కుమార్తె

- మరొకరితో సహజీవనం చేస్తూ కుదరదన్న తల్లి

- ప్రియుడితో కలిసి కుమార్తెపై దూషణలు

- మనస్తాపంతో తల్లి ఇంటికి సమీపంలో ఆత్మహత్య

విజయవాడ/చిట్టినగర్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి):

తండ్రి మరణించడంతో తల్లికి వచ్చిన బీమా సొమ్ములో వాటా తీసుకోవడానికి వచ్చిన కుమార్తెను తల్లి, తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి దూషించడంతో మనస్తాపం చెంది పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే... చిట్టినగర్‌కు చెందిన గుత్తికొండ రమాదేవి భర్త మోహనరావు కొద్దినెలల క్రితం చనిపోయాడు. ఆయన చెల్లించిన బీమాకు సంబంధించి రూ.8లక్షలు రమాదేవికి అందాయి. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె విజయలక్ష్మి తల్లి ఇంటికి సమీపంలో ఉంటోంది. చిన్న కుమార్తె కామిశెట్టి మౌనిక భర్తతో కలిసి విశాఖపట్నంలో నివాసం ఉంటోంది.

కుమార్తెపై పోలీసులకు తల్లి ఫిర్యాదు

తండ్రి బీమా సొమ్ములు తల్లికి అందాయన్న విషయం తెలుసుకున్న మౌనిక కొద్దిరోజుల క్రితం తల్లి రమాదేవి వద్దకు వచ్చింది. అప్పుడప్పుడు సమీపాన ఉన్న అక్క విజయలక్ష్మి ఇంటికి వెళ్లి వస్తోంది. భర్త మరణించిన తర్వాత రమాదేవి వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విషయం తెలిసి అనేక సార్లు తల్లిని మౌనిక మందలించింది. విశాఖకు వచ్చి తన వద్ద ఉండాలని చెప్పింది. దీన్ని రమాదేవి పెద్దగా పెట్టించుకోలేదు. ఈ క్రమంలో మౌనిక తనకు రావాల్సిన వాటా ఇవ్వాలని తల్లి రమాదేవిని గట్టిగా అడిగింది. దీనిపై తల్లి, కుమార్తె మధ్య వివాదం జరిగింది. దీనితో మౌనికపై రమాదేవి కొత్తపేట పోలీసులకు మార్చి 30న ఫిర్యాదు చేసింది. డబ్బుల కోసం కుమార్తె తనను వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. దీనితో పోలీసులు స్టేషన్‌కు రావాలని మౌనికకు ఫోన్‌ చేశారు.

భార్య ఆత్మహత్యకు అత్తే కారణమని అల్లుడి ఫిర్యాదు

బుధవారం రాత్రి రమాదేవి ఇంటికి ఆమె సహజీవనం చేస్తున్న వెంకటేశ్వరరావు వచ్చాడు. ఈ ఇద్దరిని ప్రత్యక్షంగా చూసిన మౌనిక కోపాన్ని ఆపుకోలేకపోయింది. వెంకటేశ్వరరావును పరుష పదజాలంతో దూషించింది. అప్పటికే బీమా సొమ్ములో వాటా అడగడంతో మౌనికపై రమాదేవి ఆక్రోశంతో ఉంది. తాను సహజీవనం చేస్తున్న వ్యక్తిని తన ఎదుటే దూషించడంతో తట్టుకోలేని ఆమె కుమార్తెపై ఎదురు తిరిగింది. రమాదేవి, వెంకటేశ్వరరావు కలిసి మౌనికను దూషించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన అక్క విజయలక్ష్మి, భర్త కృష్ణశంకర్‌కు ఫోన్‌ చేసి తల్లి, వెంకటేశ్వరరావు అన్న మాటలు చాలా బాధించాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను చనిపోతున్నానని, తన ఇద్దరి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. ఆ తర్వాత తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగింది. మౌనిక చెప్పిన మాటలకు కంగారు పడిన అక్క విజయలక్ష్మి మరో బంధువుతో కలిసి తల్లి ఇంటికి బయలుదేరింది. ఆ ఇంటికి సమీపంలో మౌనిక పడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక భర్త కృష్ణశంకర్‌ విజయవాడకు చేరుకున్నారు. అత్త రమాదేవి వేధింపుల కారణంగానే మౌనిక ఆత్మహత్య చేసుకుందని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తల్లీ కుమార్తెల మధ్య రాజీ కోసం లంచం

కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటాద్రిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. మార్చి 30వ తేదీన రమాదేవి నుంచి ఫిర్యాదు తీసుకున్న తర్వాత స్టేషన్‌కు రావాలని పలుమార్లు ఆయన మౌనికకు ఫోన్లు చేశారు. దీనికి ఆమె వస్తానని జవాబు ఇస్తూనే రోజులు గడిపింది. తర్వాత వెంకటాద్రి ఫోన్‌ చేసి ఈ కేసును రాజీ చేస్తానని మౌనికకు భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి ఆమె నుంచి కొంత మొత్తాన్ని ఫోన్‌పే చేయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మౌనిక సోదరి విజయలక్ష్మి, బంధువులు చెబుతున్నారు. ఫోన్‌పే వ్యవహారం ఇన్‌స్పెక్టర్‌ కొండలరావు దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన అంతర్గతంగా విచారణ చేశారు. ఫోన్‌పే ఆరోపణల్లో వాస్తవం ఉందని ఆయన నిర్ధారించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - Apr 04 , 2025 | 01:07 AM