Share News

Vijayanagaram : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:52 AM

విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన కోనారి ప్రసాద్‌ (28) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరును సోమవారం రాత్రి...

Vijayanagaram : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

  • పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు దారుణ హత్య

  • తలను రాయికేసి కొట్టి, కత్తితో పొడిచి చంపిన దుండగులు

  • విజయనగరం జిల్లాలో దారుణం

తెర్లాం, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన కోనారి ప్రసాద్‌ (28) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరును సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్యచేశారు. పోలీసుల కథనం మేరకు.. ప్రసాద్‌ బెంగళూరులోని ఐబీఎంలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సంబంధాలు చూసుకునేందుకు ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం అమ్మమ్మ ఊరు విజయరాంపురానికి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి బయల్దేరాడు. రాత్రి 9-30 గంటల సమయంలో గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రసాద్‌ మృతదేహం పడి ఉండడాన్ని చూసిన వారు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు ఆధారాలు సేకరించింది. మృతదేహం మీద కత్తిగాట్లు కనిపిస్తున్నాయని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రసాద్‌ తలను ఓ రాయికేసి గట్టిగా బాదడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోందని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - Feb 12 , 2025 | 04:53 AM