Share News

Trazady : ‘కన్నీళ్ల’పేట!

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:02 AM

Fishermen Missing మంగళవారం వేకువజామున నాలుగు గంటల సమయం... ఎప్పటిలాగానే ఆ నలుగురు మిత్రులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. మధ్యాహ్నానికి తిరిగి వచ్చేస్తామని కుటుంబ సభ్యులతో చెప్పారు. చిన్న ఇంజను బోటు మీద వేటకు కదిలారు. సాగర జలాల్లో కొంత దూరం వెళ్లారు. ఇంతలో బోటులో కుదుపు. ఓ రాకాసి అల పడవపై విరుచుకు పడింది. ఏం జరిగిందో గుర్తించేలోపే అది తలకిందులైంది. నలుగురు మిత్రులూ చెల్లాచెదురయ్యారు. అందులో ఇద్దరు బయట పడగా...మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు.

Trazady : ‘కన్నీళ్ల’పేట!
విలపిస్తున్న ధనరాజు భార్య కృష్ణవేణి, కుటుంబ సభ్యులు , ఇన్‌సెట్‌లో.. గల్లంతైన మత్స్యకారులు ధనరాజు, కృష్ణ(పైల్‌)

  • - సముద్రంలో పడవ బోల్తా

  • - నీటిలో పడిన నలుగురు మత్స్యకారులు

  • - ఒకరు ఈదుకుంటూ ఒడ్డుకు...

  • - మరొకరిని రక్షంచిన తోటి మత్స్యకారులు

  • - ఇద్దరు గల్లంతు

  • - విషాదంలో మంచినీళ్లపేట

  • వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): మంగళవారం వేకువజామున నాలుగు గంటల సమయం... ఎప్పటిలాగానే ఆ నలుగురు మిత్రులు సముద్రంలో చేపల వేటకు బయలుదేరారు. మధ్యాహ్నానికి తిరిగి వచ్చేస్తామని కుటుంబ సభ్యులతో చెప్పారు. చిన్న ఇంజను బోటు మీద వేటకు కదిలారు. సాగర జలాల్లో కొంత దూరం వెళ్లారు. ఇంతలో బోటులో కుదుపు. ఓ రాకాసి అల పడవపై విరుచుకు పడింది. ఏం జరిగిందో గుర్తించేలోపే అది తలకిందులైంది. నలుగురు మిత్రులూ చెల్లాచెదురయ్యారు. అందులో ఇద్దరు బయట పడగా...మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు. ఈ విషాద సంఘటన వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో చోటుచేసుకుంది. పోలీసులు.. గ్రామస్తులు తెలిపిన వివరాలివీ... మంచినీళ్లపేటకు చెందిన బొంగు కోటేశ్వరరావు, బొంగు ధనరాజు, వంక కృష్ణ, చింత వెంకటేష్‌లు మంగళవారం వేకువజామున నాలుగు గంటలకు మంచినీళ్లపేట- నువ్వలరేవు సమీపంలో చేపలవేట కోసం బోటులో సముద్రంలోకి బయలుదేరారు. తీరం నుంచి ఓ అర కిలోమీటరు దూరం లోపలికి వెళ్లేసరికి ఓ కెరటం బలంగా బోటును తాకింది. దీంతో బోటు ఒక్కసారిగా సముద్రంలో బోల్తాపడింది. అందులో ఉన్న నలుగురు మత్స్యకారులు నీటిలో పడిపోయారు. చీకటిగా ఉండడంతో ఎవరు ఎక్కడ ఉన్నారో గుర్తించలేకపోయారు. వీరిలో చింత వెంకటేష్‌ అతి కష్టమ్మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. అలలతాకిడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్న బొంగు కోటేశ్వరరావును సమీపంలో మరో బోటులో ఉన్న గ్రామస్తులు రక్షించి ...ఒడ్డుకు చేర్చారు. కానీ వంక కృష్ణ (44), బొంగు ధనరాజు (45) ఆచూకీ దొరకలేదు. మిగలిన మత్స్యకారులు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టినా.. వారి ఆచూకీ లభ్యం కాలేదు. విషయం తెలుసుకున్న మత్స్యకారుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. మెరైన్‌ సీఐ రాము, కాశీబుగ్గ రూరల్‌ సీఐ తిరుపతిరావు, వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ నిహార్‌ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మాజీ సర్పంచ్‌లు గుల్ల చిన్నారావు, గోశాల శంభూరావు, వైస్‌ ఎంపీపీ వంక రాజుతో పాటు స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ముమ్మరంగా ఽగాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌ఐ నిహార్‌ తెలిపారు. హెలికాప్టర్‌తో కూడా బారువా నుంచి సంతబొమ్మాళి తీరం వరకు గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

  • ఉధృతంగా కెరటాలు

  • గత మూడు రోజుల నుంచి సముద్రం ముందుకు వచ్చి...కెరటాలు ఉధృతంగా ఉన్నాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి వేళల్లో సముద్రం ఆటుపోట్లలో మార్పులు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు సాధారణంగానే ఉంటాయని.. చీకట్లో అలల తీవ్రతను అంచనా వేయలేకపోయామని వాపోయారు.

  • ఇదే చివరి రోజు అనుకున్నా..

  • తోటి మత్స్యకారులతో కలసి చేపల వేటకు వెళ్లాను. పెద్ద అల దాటికి బోటు బోల్తా పడింది. అందులో ఉన్న వారందరం సముద్రంలో పడిపోయాం. చీకటిలో ఎవరు ఎక్కడ ఉన్నారో కనిపించలేదు. నన్ను అలలు లోపలకు లాగుతుండడంతో నా జీవితంలో ఇదే చివరి రోజు అనుకున్నా. శక్తిమేర ప్రయత్నం చేసి... అటుగా వెళుతున్న చింత చిరంజీవి బోటును చూసి కేకలు వేశాను వారు వచ్చి రక్షించడంతో బయటపడ్డాను. నాతో వచ్చిన వాళ్లు కనిపించకపోవడం బాధగా ఉంది.

  • - బొంగు కోటేశ్వరరావు, బోటు యజమాని

  • పెద్ద దిక్కులు కనిపించక...

  • గల్లంతైన మత్స్యకారులు తమ కుటుంబాలకు పెద్దదిక్కుగా ఉంటున్నారు. వీరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బొంగు ధనరాజుకు భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో చిన్న కుమార్తె వయసు కేవలం నాలుగు నెలలే. వంక కృష్ణ కుటుంబానిదీ అదే పరిస్థితి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి గల్లంతైన వార్త తెలిసి పిల్లలు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం.

  • మంత్రి అచ్చెన్నాయుడు ఆరా

    మంచినీళ్లపేటలో ఇద్దరు మత్స్యకారులు గల్లంతైన విషయమై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష ఆరా తీశారు. స్థానిక మాజీ సర్పంచ్‌ గుల్ల చిన్నారావుతో మాట్లాడి వివరాలు సేకరించారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసు, మెరైన్‌ అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి.. గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు.

Updated Date - Apr 02 , 2025 | 12:02 AM