Roads: ఆదమరిస్తే.. అపాయమే
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:41 PM
Road Damage జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడికక్కడ రాళ్లు తేలి.. గుంతలమయంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు పట్టించుకోలేదు. దీంతో గత ఐదేళ్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం పలు ప్రధాన రహదారుల మరమ్మతులు చేపడుతోంది. కానీ, పట్టణాల్లోని పలు జంక్షన్లు, గ్రామాల్లో రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు.

గోతులమయమైన రహదారులు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
అరసవల్లి/ ఎచ్చెర్ల/ పలాస రూరల్, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడికక్కడ రాళ్లు తేలి.. గుంతలమయంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు పట్టించుకోలేదు. దీంతో గత ఐదేళ్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం పలు ప్రధాన రహదారుల మరమ్మతులు చేపడుతోంది. కానీ, పట్టణాల్లోని పలు జంక్షన్లు, గ్రామాల్లో రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. దీంతో ఆయా రోడ్లపై ప్రయాణమంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు.
ఎచ్చెర్ల మండలంలో తోటపాలెం జంక్షన్ నుంచి కొత్తపేట మీదుగా అంబేడ్కర్ నగర్ వరకు సుమారు 5 కిలోమీటర్లు పరిధి గల రోడ్డుపై ప్రయాణానికి ప్రజలు నరకయాతన పడుతున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట ఈ రోడ్డు పనులు చేపట్టారు. ఆ తర్వాత ఈ రోడ్డును ఎవరూ పట్టించుకోలేదు. వర్షం పడిందంటే ఈ రోడ్డు చెరువును తలపిస్తుంది. ఈ రోడ్డును బాగుచేస్తే.. కొత్తపేట, తోటపాలెం, కొంగరాం, ముద్దాడ గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 10 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. నాబార్డు నిధులతో ఈ రోడ్డు పనులు చేపడతామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
అరసవల్లి నుంచి శ్యాంపాలెం వెళ్లే రోడ్డు గోతులమయంగా మారింది. ఈ రోడ్డు మీదుగా సుమారు ఏడు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. శ్రీకాకుళం నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్నా, ఈ రోడ్డును బాగు చేసేందుకు ఎవరూ చొరవచూపడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
పలాస మండలంలో బంటుకొత్తూరు, కేశుపురం, సున్నాడ గ్రామాల ప్రధాన రహదారులు అధ్వానంగా ఉండడంతో ప్రజల రాకపోకలకు అగచాట్లు తప్పడం లేదు. బ్రాహ్మణతర్లా మీదుగా బంటుకొత్తూరు గ్రామానికి వెళ్లే రహదారి కచ్చా రోడ్డు కావడం, గోతులు అధికంగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సున్నాడ గ్రామానికి వెళ్లే అరకిలోమీటరు రహదారిని మట్టిరోడ్డుగానే వదిలేశారు. కేశుపురం రహదారి గోతులమయమైంది. చిన్నపాటి చినుకులు పడితే చాలు.. గోతుల్లో నీరు చేరడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
శ్రీకాకుళంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో కూడా కాలువలపై వేసిన పలకలను డీసిల్లింగ్ సమయంలో తొలగించి, మళ్లీ సరిగ్గా వేయకపోవడంతో పాదచారులకు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలిసిపురంలోని రైతుబజార్ కూడలి వద్ద కాలువపై పలకలు అస్తవ్యస్తంగా ఉండడం, రోడ్డు పై గోతులు ఏర్పడడంతో వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డును అధికారులు, నాయకులు పట్టించుకోకపోవడం గమనార్హం. కాలువపై పలకలను సరిచేసి, ప్రయాణానికి అనువుగా రోడ్డును తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే బాకర్ సాహెబ్‌పేటలో డ్రెయిన్ పలకలు పాడై, మురుగునీరు పేరుకుపోయింది. బొందిలీపురం పాత ఎంప్లాయిమెంట్ ఆఫీసు రోడ్డు వద్ద పలకలు విరిగిపోయి, చెత్తాచెదారంతో కాలువ నిండిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.