Share News

water problem: డేంజర్‌.. డేంజర్‌!

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:09 AM

Water table increase జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అవసరానికి మించి నీటి వినియోగం కారణంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవల కేంద్ర భూగర్భ జలవనరులశాఖ కీలక అధ్యయనం చేసింది. రాష్ట్రంలో 2,617 గ్రామాల్లో భూగర్భజలాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అందులో 300 గ్రామాల్లో ప్రమాదభరితంగా నీటిని తోడేస్తున్నారని తేలింది. జిల్లాకు సంబంధించి 76 గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని వెల్లడించింది.

water problem: డేంజర్‌.. డేంజర్‌!
నీరులేని తోటపల్లి కాలువ

  • జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు

  • 76 గ్రామాల్లో ప్రమాద ఘంటికలు

  • ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే 71 గ్రామాల్లో తీవ్రం

  • తోటపల్లి కాలువ నిర్వహణ అస్తవ్యస్తం

  • గత ఐదేళ్లలో కొనసాగిన నిర్లక్ష్యం

  • రణస్థలం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అవసరానికి మించి నీటి వినియోగం కారణంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవల కేంద్ర భూగర్భ జలవనరులశాఖ కీలక అధ్యయనం చేసింది. రాష్ట్రంలో 2,617 గ్రామాల్లో భూగర్భజలాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అందులో 300 గ్రామాల్లో ప్రమాదభరితంగా నీటిని తోడేస్తున్నారని తేలింది. జిల్లాకు సంబంధించి 76 గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని వెల్లడించింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే అత్యధికంగా 71 గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొన్నట్టు పేర్కొంది.ఏటా వర్షాకాలంలో భూగర్భ జలాలు ఉబికి రావడం, వేసవిలో అడుగంటడం సర్వసాధారణం. కానీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో పారిశ్రామిక, వ్యవసాయ, ఇళ్ల అవసరాలకు అధికంగా నీరు తోడేస్తుండడంతో భవిష్యత్‌లో మరికొన్ని గ్రామాలకు విపత్కర పరిస్థితులు తప్పవని హెచ్చరించింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలాచోట్ల బావులు అడుగంటిపోయాయని, చెరువులు ఎండిపోయాయని వాపోతున్నారు. భవిష్యత్‌లో తమకు మరింత నీటికష్టాలు తప్పేలా లేవని దిగులు చెందుతున్నారు.

  • పారిశ్రామిక అవసరాలతో..

  • ఎచ్చెర్ల నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం. పైడిభీమవరం పారిశ్రామికవాడతో పాటు ఎచ్చెర్ల మండలంలో ఎన్‌ఏసీఎల్‌, శ్యామ్‌ఫిస్టన్‌ వంటి పలు పరిశ్రమలు ఉన్నాయి. వీటితో స్థానికంగా ఉపాధి దొరికేది తక్కువే. కానీ ఈ పరిశ్రమలు దాదాపు నాలుగు మండలాల్లో భూగర్భ జలాలను భారీగా తోడేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పారిశ్రామిక అవసరాలకు 2.63కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నాయి. ఒక్క పైడిభీమవరం పారిశ్రామికవాడలోనే 2కోట్ల లీటర్ల నీటిని వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా కందివలస గెడ్డ నుంచి ఎక్కువగా నీటిని తోడేస్తున్నారు. సాధారణంగా 100 యూనిట్ల వరకూ నీరు ఊరితే.. 70 యూనిట్ల వరకూ తోడడం సేఫ్‌. కానీ అంతకు మించి నీటిని తోడేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో 110 యూనిట్ల వరకూ భూగర్భ జలాలను తోడుతున్నారు. ఆ ప్రభావం ఎచ్చెర్ల నియోజకవర్గం మొత్తంపై పడిప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

  • ‘తోటపల్లి’ని వదిలేశారు..

  • ఎచ్చెర్ల నియోజకవర్గం పూర్తిగా మెట్ట ప్రాంతం. కనీస స్థాయిలో కూడా సాగునీటి వనరులు లేవు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కళా వెంకటరావు చొరవతో తోటపల్లి కాలువను జి.సిగడాం, లావేరు మీదుగా రణస్థలం మండలానికి విస్తరించారు. దీంతో కొంతవరకూ సాగునీటి అవసరాలు తీరాయి. కానీ గత వైసీపీ పాలనలో తోటపల్లి కాలువపై నిర్లక్ష్యం కొనసాగింది. ఐదేళ్లు కనీసస్థాయిలో నిర్వహణ లేదు. శివారు ఆయకట్టుగా ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి నీరు వచ్చిందా? లేదా? అని పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ కాలువకు ఏటా ఖరీఫ్‌, రబీలో సాగునీరు అందే క్రమంలో భూగర్భ జలాలు పుష్కలంగా లభించేవి. కానీ ప్రస్తుతం కాలువలో నీరు లేకపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

  • ప్రమాదకర స్థితిలో ఉన్న గ్రామాలు..

  • ఎచ్చెర్ల నియోజకవర్గంలో 71 గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొనగా.. ఇందులో రణస్థలం మండలంలోనే 46 గ్రామాలు ఉండడం భయంగొల్పుతోంది. అక్కాయపాలెం, అర్జునవలస, బంటుపల్లి, బోయపేట, చిల్లపేట రాజాం, చిట్టివలస, దేరశాం, గిరివానిపాలెం, గోసం, జగన్నాథరాజపురం, జీరుకొవ్వాడ, కొండములగాం, కోష్ట, కోటపాలెం, కొచ్చెర్ల, కృష్ణాపురం, మహంతిపాలెం, మరువాడలో భూగర్భజలాలు అడుగంటాయి. అలాగే మెంటాడ, ముక్తంపురం, నరసింహగోపాలపురం, నారువా, నెలివాడ, పాపారావుపేట, పాతర్లపల్లె, పాత సుందరపాలెం, పిసిని, పైడిభీమవరం, రామచంద్రాపురం, రణస్థలం, రావాడ, సంచాం, సీతంవలస, సీతంపేట, సూరంపేట, సూరపురం, టెక్కలి, తెప్పలవలస, తిరుపతిపాలెం, ఉప్పివలస, వల్లభరావుపేట, వరాహా నరసింహపురం, వరిశాం, వెల్పురాయి, వెంకటరావుపేట, ఎర్రవరం గ్రామాల్లో కూడా నీటిఎద్దడే. దాదాపు రణస్థలం మండలం మొత్తం ప్రమాదంలో ఉన్నట్టే. వీటికితోడు జి.సిగడాం మండలంలో 6, ఎచ్చెర్ల మండలంలో ఒకటి, లావేరు మండలంలో 18 గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయినట్టు అధ్యయనంలో తేలింది. ఈ గ్రామాల్లో బోర్లు, ఇతర తాగునీటి వనరుల తవ్వకం నిషేధం. కానీ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • ఇవి చేస్తే మేలు..

  • జిల్లాలో భూగర్భ జలాలను పెంచేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తోటపల్లి కాలువకు పుష్కలంగా సాగునీరు అందించాలి. అదే సమయంలో పైడిభీమవరం చెంతనే ఉన్న కందివలస గెడ్డను ఆధునికీకరించాలి. గెడ్డలో ఉన్న పూడికను తొలగించాలి. పరిశ్రమలు వ్యర్థాలు వదలకుండా కట్టడి చేయాలి. లావేరు మండలంలో ఉన్న బుడుమూరు గడ్డను సైతం ఆధునికీకరించాలి. ఎచ్చెర్ల మండలంలో ఉన్న నారాయణవలస కాలువను పునరుద్ధరించాలి. ఈ చర్యలతోనే ఎచ్చెర్ల నియోజకవర్గానికి భవిష్యత్‌లో నీటి గండం లేకుండా చూడవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • తోటపల్లినీరు ఇవ్వాలి

    తోటపల్లి నీరు వస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. టీడీపీ పాలనలో పుష్కలంగా తోటపల్లి నీరు రావడంతో రైతులు పంటలు పండించారు.భూగర్భ జాలాలు పుష్కలంగా పెరిగాయి. గత వైసీపీ పాలనలోతోటపల్లి కాలువ నుంచి చుక్కనీరు కూడా రాలేదు. రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తోటపల్లి నీరు త్వరితగతి విడుదల చేయాలి.

    - దన్నాన సత్తిబాబు, రైతు, కొండములగాం

    ................

  • నీటి ఆదా ఆవశ్యం

    వర్షపు నీటిని ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంట్లో ఇంకుడుగుంత తవ్వుకోవాలి. అప్పుడే భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలోకి వెళ్లవు. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే.. నీటి కొరత రాదు. దీనిపై ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి.

    - బి.రమణమూర్తి, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి, శ్రీకాకుళం


water-1.gif

Updated Date - Apr 03 , 2025 | 12:09 AM