Cheap Flight Tickets Tips: అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:17 PM
తక్కువ ధరకు విమాన టిక్కెట్లు పొందాలంటే కొన్ని కిటుకులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిత్యం విమాన ప్రయాణాలు చేసే వారికి ఇవి తప్పనిసరిగా తెలిసుండాలి.

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం విమానాల్లో ప్రయాణించే స్థోమత ఉన్నా కూడా అనేక మందికి టిక్కెట్ల ధరలు చుక్కలు చూపిస్తుంటాయి. అందుకే అనేక మంది స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్‌ల కోసం ఎదురు చూస్తుంటారు. కొన్ని ప్రత్యేక సమయాల్లో బుక్ చేస్తే తక్కువ ధరలకే టిక్కెట్స్ లభిస్తాయని మరి కొందరు చెబుతారు. మరి ఇందులో నిజమెంతో.. అసలు తక్కువ ధరకు విమాన టిక్కెట్లు కొనాలంటే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం (Cheap Flight Tickets Tips).
ఉదయం వేళల్లో విమాన సర్వీసులకు డిమాండ్ తక్కువగా ఉంటుందని ఇప్పటికే అనేక నివేదికల్లో తేలింది. ముఖ్యంగా తెల్లవారుజామును 4 గంటల నుంచి 6 గంటల మధ్య విమాన సర్వీసుల్లో ఎయిర్‌లైన్స్ స్పెషల్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఇక అర్ధరాత్రి (12 గంటల నుంచి 2 గంటల వరకూ) కూడా టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్స్‌కు ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో కూడా ఎయిర్‌లైన్స్ సంస్థలు విమాన టిక్కెట్లపై డిస్కౌంట్లు ఇస్తుంటాయని అనుభవజ్ఞులు చెబుతారు.
ఇక మంగళవారం, లేదా బుధవారం ప్రయాణాలకు కూడా టిక్కెట్లు తక్కువ ధరలకే లభిస్తాయి. వారంతాలు, సెలవుల్లో మాత్రం విమాన టిక్కెట్లకు డిమాండ్ పెరిగి రేట్లు కూడా అదేస్థాయిలో పెరుగుతాయి.
ఇక దేశీ ప్రయాణాల కోసం మూడు నుంచి ఆరు వారాల ముందు టిక్కెట్లు బుక్ చేసుకుంటే అత్యధిక డిస్కౌంట్‌లు పొందొచ్చు. అంతర్జాతీయ విమానాల్లో భారీ డిస్కౌంట్ల కోసం రెండు నుంచి మూడు నెలల ముందు టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.
ఇక డిస్కౌంట్‌ల గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం పొందేందుకు కూడా అనేక మార్గాలు ఉన్నాయి. గూగుల్ ఫ్లైట్స్, స్కైస్కానర్, హాపర్, మేక్‌మైట్రిప్ వంటి సైట్‌లల్లో అలారమ్ సెట్ చేసుకుంటే డిస్కౌంట్ ఉన్నప్పుడు మనకు వెంటనే తెలిసిపోతుంది.
ప్రైస్ ట్రాకింగ్ నుంచి తప్పించుకునేందుకు బ్రౌజర్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్‌లోనే టిక్కెట్ల కోసం సెర్చ్ చేయాలి. క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు వంటి వాటిపై కూడా ఓ కన్నేసి ఉంచితే అదనపు డిస్కౌంట్లు పొందొచ్చు.
ఇక వెనక వరుసల్లోని సీట్లు, కిటికీ పక్క సీట్ల టిక్కెట్ల ధరలు ఎక్కువే అయినా కూడా రద్దీని బట్టి వీటిని కూడా తక్కువ ధరలకే దక్కించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
మొదటిసారి బంగారం కంటున్నారా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏవంటే..
రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు