Share News

Government buildings: అంతన్నారు.. ఇంతన్నారు!

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:20 AM

Incomplete government buildings ప్రజల ముంగిటకే పాలన అంటూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామాల్లో సచివాలయ భవనాలతో పాటు అన్నదాతల కోసం రైతు భరోసా కేంద్రాలు (ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మారాయి), ప్రజలకు వైద్యం అందించేందుకు వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌లు, నిరుద్యోగుల కోసం డిజిటల్‌ లైబ్రరీలు, పాడి రైతుల కోసం బల్క్‌మిల్క్‌ కేంద్రాలు నిర్మిస్తామని గొప్పలు చెప్పింది. వీటి కోసం స్థలాలు కేటాయించి పనులు ప్రారంభించింది. అయితే, ఐదేళ్ల పాలనలో కొన్ని భవన నిర్మాణాలే పూర్తయ్యాయి. మిగతా భవనాలు పునాదుల స్థాయిని దాటలేదు.

Government buildings: అంతన్నారు.. ఇంతన్నారు!

  • పూర్తికాని సచివాలయ భవన నిర్మాణాలు

  • రైతు సేవా కేంద్రాలు, హెల్త్‌క్లినిక్‌లదీ ఇదే పరిస్థితి

  • డిజిటల్‌ లైబ్రరీలు, బల్క్‌మిల్క్‌ కేంద్రాలు కూడా..

  • బిల్లుల చెల్లింపులో గత వైసీపీ సర్కారు నిర్లక్ష్యం

  • కూటమి ప్రభుత్వంపైనే భారం

  • మెళియాపుట్టి మండలం రామచంద్రాపురం సమీపంలో సచివాలయం, రైతుసేవా కేంద్రం, డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణాల కోసం వేసిన పిల్లర్లు ఇవి(పైచిత్రం). వెంకటాపురం, కొత్తూరు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినట్లు గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ, పనులు మాత్రం పిల్లర్ల స్థాయికే పరిమితయ్యాయి. వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడి స్వగ్రామంలోనే పనులు ఇలా ఉంటే మిగతా చోట్ల ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

    ..........................

  • మెళియాపుట్టి మండలం వసుంధర సచివాలయం పరిధిలో రట్టిణి, వసుంధర, నడసందర పంచాయతీలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వసుంధర వద్ద సచివాలయంతో పాటు రైతుసేవా కేంద్రం, డిజిటల్‌ లైబ్రరీ, హెల్త్‌క్లినిక్‌, బల్క్‌మిల్క్‌ కేంద్రాల నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేశారు. అయితే ఒక్క రైతు సేవా కేంద్రం భవనం మాత్రమే నిర్మించారు. అది కూడా సగం పనులే చేశారు. మిగతా భవనాల పనులు పునాదులకే పరిమితమయ్యాయి.

  • మెళియాపుట్టి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ప్రజల ముంగిటకే పాలన అంటూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామాల్లో సచివాలయ భవనాలతో పాటు అన్నదాతల కోసం రైతు భరోసా కేంద్రాలు (ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మారాయి), ప్రజలకు వైద్యం అందించేందుకు వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌లు, నిరుద్యోగుల కోసం డిజిటల్‌ లైబ్రరీలు, పాడి రైతుల కోసం బల్క్‌మిల్క్‌ కేంద్రాలు నిర్మిస్తామని గొప్పలు చెప్పింది. వీటి కోసం స్థలాలు కేటాయించి పనులు ప్రారంభించింది. అయితే, ఐదేళ్ల పాలనలో కొన్ని భవన నిర్మాణాలే పూర్తయ్యాయి. మిగతా భవనాలు పునాదుల స్థాయిని దాటలేదు. మొదట్లో కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు మంజూరు చేయడంతో చాలాచోట్ల నిర్మాణాలు పూర్తయి భవనాలు అందుబాటులోకి వచ్చాయి. తరువాత రానురానూ బిల్లుల చెల్లింపులో జగన్‌ సర్కారు నిర్లక్ష్యం చేయడంతో మిగతాచోట్ల పనులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లూ కేంద్రం నుంచి వచ్చిన ఉపాధిహామీ మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులను సచివాలయాలు, రైతుసేవా, బల్క్‌మిల్క్‌ కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే వినియోగించింది. కానీ, పనులు మాత్రం పూర్తి చేయలేదు.

  • జిల్లాలో పరిస్థితి..

  • జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో 833 సచివాలయ భవనాల పనులు ప్రారంభించారు. ఒక్కో భవనానికి రూ.40 లక్షల చొప్పున రూ.309.63 కోట్ల అంచనాతో నిధులు మంజూరు చేశారు. ఇప్పటివరకు 488 భవనాలు పూర్తి కాగా, 345 భవనాలు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వీటికి రూ.144.83 కోట్లు ఖర్చు చేసినట్లు గత ప్రభుత్వం లెక్కలు చూపించింది.

  • రైతుభరోసా కేంద్రాలకు సంబంధించి ఒక్కోదానికి రూ.20.80 లక్షలు మంజూరు చేశారు. జిల్లాలో 656 ఆర్‌బీకేలకుగాను 238 నిర్మాణాలు జరిగాయి. 40 కేంద్రాల పనులు పూర్తయినా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రార్లు ఆ భవనాలను అప్పగించలేదు. 378 ఆర్‌బీకేల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

  • హెల్త్‌క్లినిక్‌లకు సంబంధించి ఒక్కో భవన నిర్మాణానికి రూ.17.50 లక్షలు మంజూరు చేశారు. జిల్లాలో 663 పనులకు గాను రూ.180.50 కోట్ల అంచనాలతో నిధులు మంజూరు చేశారు. ఇందులో 186 పనులు మాత్రమే పూర్తిచేశారు. ఇంకా 477 భవనాలు పలు స్థాయిల్లో ఉన్నాయి. దీనికి రూ.42.18 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపారు.

  • 194 మిల్క్‌సెంటర్లకుగాను 22 పనులు మాత్రమే ప్రారంభించారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో భవనానికి రూ.16లక్షలు చొప్పున రూ.22.83 కోట్లు మంజూరు చేశారు.

  • 195 డిజిటల్‌ లైబ్రరీలకు గాను 26 పనులు మాత్రమే ప్రారంభించారు. రూ.31.20 కోట్ల అంచనాలతో నిధులు మంజూరు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో మార్పులు చేపట్టేందుకు కమిటీలు ఏర్పాటు చేసింది. సిబ్బందిని వేరే శాఖలకు సర్దుబాటు చేయాలనే ఆలోచనలో ఉంది. ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో కూడా సచివాలయాలకు నిధులు కేటాయించలేదు. దీంతో భవనాల పనుల పూర్తిపై సందేహాలు నెలకొన్నాయి.

  • పూర్తయిన భవనాలను గుర్తిస్తున్నాం

    గత ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తయిన సచివాలయ, రైతుసేవా కేంద్రాల భవనాలను గుర్తిస్తున్నాం. ఈ నివేదికను ప్రభుత్వానికి అందిస్తాం. కొంతమంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో భవనాలను అప్పగించడం లేదు. వారితో చర్చించి భవనాలు అప్పగించాలని కోరుతాం.

    - ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి

Updated Date - Apr 15 , 2025 | 12:20 AM