Theft : జైలులో పరిచయం.. నాలుగు జిల్లాల్లో చోరీలు
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:32 PM
Police investigation జిల్లాతోపాటు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 17 కేసుల్లో నిందితులైన ఇద్దరు అంతరజిల్లా దొంగలను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు అంతరజిల్లా దొంగల అరెస్టు
17 కేసుల్లో చోరీ చేసినట్టు గుర్తింపు
రూ.45లక్షల ఆభరణాలు, వాహనం స్వాధీనం
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లాతోపాటు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 17 కేసుల్లో నిందితులైన ఇద్దరు అంతరజిల్లా దొంగలను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ‘పలాస, కాశీబుగ్గ పరిధిలో నర్సిపురం రైల్వేగేటు ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిద్దరినీ పోలీసులు విచారించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం జోగంపేటకు చెందిన పోల భాస్కరరావు, ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటకు చెందిన ముద్దాడ నర్సింగరావులుగా వారిని గుర్తించారు. గతంలో వీరిద్దరిపై జిల్లాలో 16 దొంగతనాలు, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఒక చోరీకేసుతోపాటు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో కూడా దొంగతనం కేసులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరూ గతేడాది పలాసలో దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి సుమారు రూ.36.80లక్షల విలువైన 435.52 గ్రాములు(37తులాలు) బంగారు ఆభరణాలు, ఒక డైమండ్ బ్రాస్‌లెట్, డైమండ్ లాకెట్, సుమారు రూ.26వేల విలువైన 233.2 గ్రాములు(20తులాలు) వెండి వస్తువులు, రూ.25వేల నగదు, ఒక మోటారు సైకిల్, ఒక కారును స్వాధీనం చేసుకున్నామ’ని ఎస్పీ తెలిపారు.
‘ఈ కేసులో నిందితుడైన ముద్దాడ నర్సింగరావు గతంలో రెండు ద్విచక్ర వాహనాలను కూడా దొంగతనం చేశాడు. 2018లో జైలుకు వెళ్లిన వీరిద్దరికీ అక్కడే పరిచయం ఏర్పడి, వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన ఆభరణాలను విశాఖపట్నానికి చెందిన బోని గోవిందరాజులకు, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గ్రంథి శ్రీనివాసరావుకు, ఎచ్చెర్లకు చెందిన పొలం కృష్ణ, ఒడిశాకు చెందిన ముత్యాలుకు ఇచ్చినట్లు విచారణలో తేలింది. దొంగిలించిన కొంత సొమ్ముతో కారు కొన్నారు. వాస్తవానికి 17 కేసుల్లో 76 తులాల బంగారం చోరీ చేసినప్పటికీ.. 37 తులాలు రికవరీ చేశాం. త్వరలో మిగిలిన బంగారాన్ని కూడా రికవరీ చేస్తామ’ని ఎస్పీ స్పష్టం చేశారు. దొంగతనాల్లో వారిద్దరికీ సహకరించిన మరొకరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కేసులో ప్రతిభ చాటిన ఏఎస్పీ క్రైం పి.శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ వీవీ వెంకటప్పారావు, సీసీఎస్ సీఐ సూర్యచంద్రమౌళి, కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, సీసీఎస్ ఎస్‌ఐ కె.మధుసూధనరావు, గఫూర్, హెచ్‌సీ శ్యామసుందరరావు, పీసీలు భాస్కరరావు, విజయకుమార్, హరీష్, ఉషాకిరణ్‌ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు అందజేశారు. సమావేశంలో ఏఎస్పీ(అడ్మిన్) కె.వి.రమణ, ఎస్బీ సీఐ ఇమ్మాన్యుయేల్ రాజు పాల్గొన్నారు.