Share News

Offshore: ఆఫ్‌‘జోర్‌’!

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:16 AM

Reservoir construction ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2008లో రూ.127కోట్ల వ్యయంతో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు.

Offshore: ఆఫ్‌‘జోర్‌’!
పనులు పూర్తి కాకముందే ఆఫ్‌షోర్‌ రిజర్వాయరులో నిల్వ ఉన్న నీరు... మట్టి పనులకోసం సిద్ధమైన భారీ టిప్పర్లు..

  • ఊపందుకున్న రిజర్వాయర్‌ పనులు

  • రెండేళ్లలో పూర్తిచేసేందుకు ప్రణాళికలు

  • ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటనతో రైతుల్లో ఆశలు

  • పలాస, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2008లో రూ.127కోట్ల వ్యయంతో ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిర్వాసితులు, భూములు కోల్పోయిన వారికి ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో శంకుస్థాపన వరకే ప్రాజెక్టు పరిమితమైంది. తర్వాత ప్రభుత్వాలు మారినా.. ఏళ్ల తరబడి ‘ఆఫ్‌షోర్‌’ పనులకు మోక్షం కలగలేదు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం.. ఆఫ్‌షోర్‌ నిర్మాణంపై దృష్టి సారించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే శిరీష ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెండు బడ్జెట్‌ల్లో రూ.30కోట్లు, రూ.90కోట్లు ప్రకటించి పనులు చేయాలని జలవనరులశాఖకు ఆదేశించింది. 20 రోజులుగా పాత బకాయలు తీర్చడంతోపాటు కొత్తగా నిధులు వెచ్చించడంతో పనులు ఊపందుకున్నాయి. రెండు కిలోమీటర్ల పొడవునా గట్టు, సరప్లస్‌వీయర్‌(పరుపు), స్లూయస్‌, ప్రధాన కాలువ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే గట్టు పనులు జరుగుతున్నాయి. మట్టి తవ్వకాలపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, వంశధార ఎస్‌ఈ పీవీ తిరుపతిరావు, పలాస, పాతపట్నం ఎమ్మెల్యేలు గౌతు శిరీష, మామిడి గోవిందరావుతో కలిసి శనివారం రేగులపాడులో పర్యటించారు. రైతులు, నిర్వాసితులు, అధికారులతో సమీక్షించారు. నష్టపరిహారం చెల్లించకుండా మట్టిని తవ్వుతుండడంతో ప్రజల్లో నెలకొన్న అశాంతిని తొలగించేలా కలెక్టర్‌ తగు ఆదేశాలు జారీచేశారు. 2019 పునరావాస ప్యాకేజీతోపాటు నష్టపరిహారం 20 రోజుల్లో చెల్లించేలా ఒప్పందం కుదిర్చారు. కేవలం 70 రోజుల వ్యవధిలో ఏడు లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు జరగాలని కాంట్రాక్టర్లకు మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు గట్టు ఎత్తుచేసే ప్రక్రియ శరవేగంతో జరుగుతోంది. మొత్తం రెండు కిలోమీటర్ల పొడవునా మీటరు ఎత్తులో మట్టిని వేసి చదును చేశారు. రిజర్వాయర్‌ కింది లెవెల్‌ నుంచి ఐదు మీటర్ల ఎత్తు వరకూ గట్టు నిర్మించారు. మట్టి పనులు శరవేగంతో జరుగుతున్న నేపథ్యంలో నీటిని ఒడిసి పట్టేందుకు అవకాశం ఉంది. సరప్లస్‌వీయర్‌ ప్రాంతంలో సిమెంట్‌ పనులను రిజర్వాయర్‌ చివరిదశలో చేపట్టనున్నారు. అలాగే కాలువలు, పలాస-పర్లాకిమిడి ప్రధాన రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే భూసేకరణ చేసినా నష్టపరిహారం వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఆ పనుల్లో పురోగతి లేదు. దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఆ పనులు ఈ ఏడాది చివరినాటికి ప్రారంభించే అవకాశం ఉంది.

  • ఖరీఫ్‌ నాటికి నీరు

  • పనులు 20 శాతం జరగకముందే ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌లో నీరు నిల్వ ఉంటోంది. గట్టుపనులు శరవేగంతో పూర్తి చేసి వచ్చే ఖరీఫ్‌ నాటికి ఒక ఎమ్మెల్డీ నీరు నిల్వ చేసి కుడి కాలువ ద్వారా కనీసం నందిగాం మండలం రైతులకు సాగునీరు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు వంశధార ఎస్‌ఈ తిరుపతిరావు ఇటీవల ఈ విషయాన్ని స్పష్టం చేయడం.. అందుకు తగిన విధంగానే పనులు సాగుతుండడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు నిధులు మొత్తం విడుదల చేస్తే రెండేళ్లలో ఆఫ్‌షోర్‌ జలాశయం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్గత కాలువలు, మహేంద్రతనయ నది నుంచి ప్రధాన కాలువల నిర్మాణంపై అధికారులు దృష్టి సారిస్తే ప్రజల చిరకాలవాంఛ నెరవేరనుంది.

  • పూర్తిస్థాయిలో నీరందిస్తాం

  • రెండేళ్లలో ఆఫ్‌షోర్‌ పూర్తవుతుంది. నా తండ్రి గతంలో గెడ్డం దీక్ష చేసి సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి ఆఫ్‌షోర్‌ తీవ్రత తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార నీరు సకాలంలో రైతులకు ఇచ్చాం. మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, పూర్తిస్థాయిలో ఆఫ్‌షోర్‌పై దృష్టి పెట్టారు. బడ్జెట్‌లో ప్రాధాన్యతలో లేకపోయినా రూ.120కోట్లు మంజూరు చేయడం జిల్లాప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఆఫ్‌షోర్‌ ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు, పలాస-కాశీబుగ్గ ప్రజలకు తాగునీరు అందిస్తాం.

    - గౌతు శిరీష, పలాస ఎమ్మెల్యే

Updated Date - Apr 15 , 2025 | 12:16 AM