ఇన్నాళ్లకు కదిలారు
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:48 PM
అక్రమంగా ఇసుక తరలింపుపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు కదిలారు. గొట్టా బ్యారేజీ నుంచి అంబావల్లి గ్రామం వరకు పోలీసుల సాయంతో దాడులు చేశారు. 16 ట్రాక్టర్లను తహసీల్దారు కార్యాలయం వద్దకు తరలించారు.

హిరమండలం, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): అక్రమంగా ఇసుక తరలింపుపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు కదిలారు. గొట్టా బ్యారేజీ నుంచి అంబావల్లి గ్రామం వరకు పోలీసుల సాయంతో దాడులు చేశారు. 16 ట్రాక్టర్లను తహసీల్దారు కార్యాలయం వద్దకు తరలించారు. మండలంలో అధికారిక రేవులు లేకపోయినా ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. భగీరథపురం, పిండ్రువాడ, అంబావల్లి తదితర గ్రామాల సమీపంలోని వంశధార నదీ గర్భంలో ఏడాది కాలంగా రాత్రీ పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకున్నా అక్రమార్కులు ఇష్టానుసారంగా ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పథకాన్ని నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు నాయకులు సొంతంగా వంశధార నదిలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసుకొని పాతపట్నం, టెక్కలి, శ్రీకాకుళం, పలాస, తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖాధికారులు తమకేమీ పట్టనట్లు ఇన్నాళ్లూ ఊరుకున్నారు.
ఫ ఏమైందో ఏమో...
స్థానిక రెవెన్యూ అధికారులు గురువారం ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపారు. గత 10 నెలల కాలంగా లేనిది ఒక్కసారిగా ఏమైందో గానీ గొట్టా బ్యారేజి నుంచి అంబావల్లి గ్రామం వరకు పోలీసుల సాయంతో దాడులు చేశారు. సుభలయ, మెట్టతోట, పిండ్రువాడ, మహాలక్ష్మీపురం గ్రామాల సమీపంలో వంశధార నదీ గర్భం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంతో పాటు తెంబూరు,ఽ దనుపురం, సారవకోట, టెక్కలి వైపు అక్రమంగా తరలిస్తున్న మొత్తం 16 ట్రాక్టర్లను స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్దకు తరలించారు. ట్రాక్టర్ యజమానుల నుంచి అపరాధ రుసుం వసూలు చేయనున్నట్టు తహసీల్దారు హనుమంతరావు చెప్పారు. ఎస్‌ఐ ఎండీ యాసిన్‌తో పాటు ఆర్‌ఐ శంకరరావు, వీఆర్వోలు, వీఆర్‌ఐలు దాడుల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఇసుక రీచ్‌కు అనుమతులు లేనప్పుడు ఎందుకు ఇన్ని ఇసుక ట్రాక్టర్లు తిరుగుతున్నాయి? ఈ ఇసుక ఎక్కడిది? ఎక్కడికి తరలిస్తున్నారన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.