GV Anjaneyulu: రాష్ట్రాన్ని దివాలా తీయించిన వైసీపీ
ABN, Publish Date - Mar 05 , 2025 | 06:14 AM
‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది. పేదల ఇళ్ల పేరు చెప్పి అడ్డగోలుగా దోచుకున్నారు.

పేదల ఇళ్ల పేరుతో అడ్డగోలు దోపిడీ
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలు
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది. పేదల ఇళ్ల పేరు చెప్పి అడ్డగోలుగా దోచుకున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది’ అని కూటమి ప్రతినిధులు విమర్శించారు. మంగళవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ‘గత జగన్ ప్రభుత్వం ఐదేళ్లపాటు ఆర్థిక విధ్వంసానికి పాల్పడి రాష్ట్రాన్ని దివాలా తీయించింది. జగన్ రాష్ట్రాన్ని లూఠీ చేసి తన సొంత ఆస్తులు పెంచుకున్నారు. 2004లో తన ఆస్తులు రూ.2 కోట్లు మాత్రమేనని అఫిడవిట్‌లో పేర్కొన్న జగన్‌కు... ఇప్పుడు రూ.లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? జగన్ హయాంలో చేసిన అప్పులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతినెలా రూ.60వేల కోట్లు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అంటూ ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు మండిపడ్డారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ‘గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల్లో పేదలకు కట్టించిన ఇళ్లు పేకమేడల్లా ఉన్నాయి. చేత్తో తోస్తే పడిపోతున్నాయి. ఒక ఇంటికి వాడాల్సిన సిమెంటు, స్టీలును మూడు, నాలుగు ఇళ్లకు సరిపెట్టేశారు. అవి లబ్ధిదారులు నివసించడానికి పనికిరావు. అత్యంత నాసిరకంగా నిర్మించిన పునాదులపై ఇళ్లు నిర్మించినా నిలబడవు. కాబట్టి దీనిపై ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రమంతా దోచేశారు: ప్రత్తిపాటి పుల్లారావు
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ‘పేదల ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా పేరుతో జగన్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోపిడీ చేసింది. అదే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు దోచుకున్నారు. పాలకుడు అసమర్థుడు, అవినీతిపరుడు అయితే రాజ్యం ఎలా ఉంటుందో జగన్ పాలనలో చూశాం’ అని అన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ, ‘జగన్ గత ఐదేళ్లూ నియంత పాలన సాగించారు. రాష్ట్రాన్ని అన్నివిధాలా సర్వనాశనం చేశారు’ అని అన్నారు.
రాష్ట్రాన్ని దివాలా తీయించింది: సుజనా
బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి మాట్లాడుతూ... ‘గత ఐదేళ్లూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రూ.81వేల కోట్ల అప్పులుచేసి రాష్ట్రాన్ని దివాలా తీయించింది. కూటమి ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుంటూ, ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇది కష్టమైన పనైనా కూటమి ప్రభుత్వం అద్భుతమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలకు మంగళగిరి ఎయిమ్స్‌ను రిఫరల్ ఆసుపత్రిగా చేయాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కోరారు. ఎమ్మెల్యేలు పంచకర్ల రమేశ్ బాబు, తెనాలి శ్రవణ్‌కుమార్, శంకర్, గౌరు చరితారెడ్డి మాట్లాడారు.
Updated Date - Mar 05 , 2025 | 06:14 AM