Tiruvuru MLA : మరో వివాదంలో కొలికపూడి
ABN, Publish Date - Jan 12 , 2025 | 04:43 AM
వివాదాలకు చిరునామాగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. గ్రామంలో రెండు కుటుంబాల నడుమ నెలకొన్న ఆస్తి తగాదాలో తలదూర్చిన ఎమ్మెల్యే...
ఆస్తి తగాదాలో తల దూర్చిన ఎమ్మెల్యే
ఎస్టీ దంపతులపై దాడి, దూషణలు
ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు
ఎ.కొండూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): వివాదాలకు చిరునామాగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. గ్రామంలో రెండు కుటుంబాల నడుమ నెలకొన్న ఆస్తి తగాదాలో తలదూర్చిన ఎమ్మెల్యే... ఎస్టీ దంపతులపై దాడి చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో కొత్తగా సీసీ రోడ్డు నిర్మించారు. ఇది అన్నదమ్ముల మధ్య భూ వివాదానికి కారణమైంది. గ్రామానికి చెందిన భూక్యా రాం బాబు, భూక్యా కృష్ణ అన్నదమ్ముల బిడ్డలు. వీరిలో భూక్యా రాంబాబు టీడీపీ నాయకుడు కాగా భూక్యా కృష్ణ వైసీపీ నేత. కృష్ణ భార్య చంటి పంచాయతీలో 5వ వార్డు సభ్యురాలు. ఈ రెండు కుటుంబాల నడుమ చాలాకాలంగా భూ వివాదం నడుస్తోంది. తాజాగా కృష్ణకు చెందిన ప్రైవేటు భూమిలో రాంబాబు సీసీ రోడ్డు వేశారు. దీన్ని ప్రశ్నిస్తూ కృష్ణ రోడ్డుకు అడ్డంగా కంచె వేశారు. ఈ వివాదం ఎమ్మెల్యే కొలికపూడి దృష్టికి వెళ్లడంతో ఆయన శనివారం సాయంత్రం గ్రామానికి వచ్చారు. రాంబాబు ఎమ్మెల్యే అనుచరుడు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సీసీ రోడ్డును పరిశీలించి అనంతరం భూక్యా కృష్ణ, చంటి దంపతులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని దూషిస్తూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దంపతులపై దాడి చేసి గాయపరిచారు. ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు.
ఈ ఘటనతో మనస్థాపానికి గురైన చంటి పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తిరువూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంద నడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఘటనపై ఆగ్రహించిన గామస్తులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగా రు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడంపట్ల ఆగ్ర హంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో మైలవరం ఏసీపీ ప్రసాదరావు, తిరువూరు సీఐ గిరిబాబు తదితరులు గ్రామానికెళ్లి పరిస్థితిని ఆదుపు చేస్తున్నారు.
చంద్రబాబు అసంతృప్తి.. వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఎమ్మెల్యే నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు సమాచా రం. ఏది ఏమైనా ఘటనకు ఎమ్మెల్యే కారణం కావడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.
Updated Date - Jan 12 , 2025 | 04:43 AM