TTD Chairman : తొక్కిసలాట దురదృష్టకరం
ABN, Publish Date - Jan 14 , 2025 | 04:25 AM
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరమని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
భవిష్యత్‌లో ఇలాంటివి జరక్కుండా చర్యలు
అది తప్ప మిగతా ఏర్పాట్లన్నీ బాగున్నాయ్
టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి
దళారీ వ్యవస్థను కట్టడిచేశాం: ఈవో
తిరుమల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరమని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఆయన టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుమల అంటే హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని, తిరుమల గురించి రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి, విచారించి, నిర్ధారించి రాయాలని కోరారు. సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాయడం మంచిది కాదన్నారు. తిరుపతిలో జరిగిన ఘటన తప్ప మిగిలిన ఏర్పాట్లన్నీ బాగున్నాయని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారన్నారు. అధికారుల శ్రమను మనం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి జరిగినవన్నీ ఈ రోజుతో వదిలేసి ఇకపై దేవుడి గురించి ప్రచారం చేయాలని అభ్యర్థించారు. గత ఆరు నెలలుగా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూప్రసాదాలు, వసతి తదితర సేవలు అందిస్తున్నామని ఈవో చెప్పారు. దళారీ వ్యవస్థను కూడా కట్టడి చేశామని, విజన్ డాక్యుమెంట్‌ను కూడా రూపొందిస్తున్నామన్నారు. తొక్కిసలాట అంశంపై న్యాయ విచారణ జరుగుతోందని, అందులో పూర్తి విషయాలు వెలువడతాయని చెప్పారు. తిరుమలలో వసతి ఎవరికి కేటాయించాలో తెలియని అగమ్య పరిస్థితి నుంచి మరింత పూర్తి పారదర్శకంగా వసతి కేటాయిస్తున్నామని వెంకయ్యచౌదరి తెలిపారు. రాబోయే రోజుల్లో వసతి కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా భక్తుల వాట్సా్‌పకే పూర్తి సమాచారం, రిజిస్ర్టేషన్ చేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు త్వరగా దర్శనం చేయించేలా విచక్షణ కోటాను, మానవ జోక్యాలను తగ్గించామని చెప్పారు.
మృతుల కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం: ఎంఎస్ రాజు
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకునేందుకు నేరుగా వారి ఇళ్లకే వెళ్లి ఆర్థిక సాయం అందజేశామని టీటీడీ బోర్డు సభ్యుడు, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నా స్పందించిన దాఖలాలులేవన్నారు. విశాఖకుచెందిన శాంతి, లావణ్య కుటుంబం, రజిని, పెదబొడ్డేపల్లిలో నాయుడుబాబు కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. హోంమంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి బాధితులను పరామర్శించామన్నారు.బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తనవంతు గా టీటీడీ చైర్మన్‌కు రూ.3 లక్షలు అందించానని చెప్పారు.
Updated Date - Jan 14 , 2025 | 04:25 AM