ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమలలో పెను విషాదం!

ABN, Publish Date - Jan 09 , 2025 | 05:03 AM

తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది.

Tirumala Stampede

  • వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో అపశ్రుతి

  • బైరాగిపట్టెడ కేంద్రంలో తీవ్ర తొక్కిసలాట

  • ఆరుగురి మృతి పెద్దసంఖ్యలో భక్తులకు గాయాలు

  • క్యూల్లోకి అనుమతించడంతో దూసుకొచ్చిన భక్తులు

  • ఒత్తిడి తట్టుకోలేక ఊడి, తెరుచుకున్న గేటు

  • ఒక్కసారిగా తొక్కిసలాట... నలిగిపోయిన భక్తులు

  • టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఇలాంటి దుర్ఘటన

‘తిరుమల’ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది! రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ... తొలిసారిగా, ఆ దశ దాటి భక్తుల మరణాలూ చోటు చేసుకున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండగా... తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్‌ జారీ కౌంటర్‌ మృత్యు వేదికయింది. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు.. తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్‌ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో.. పలుచోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో.. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత విలవిలలాడారు. ఈ విషాదంలో ఆరుగురు మరణించగా.. వారిలో ఐదుగురు మహిళలే. తొక్కిసలాటలో పెద్దసంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్‌, రుయా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడటం వంటి ఘటనలు జరిగినప్పటికీ.. మరణాలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. టీటీడీ చరిత్రలోనే ఇది మాయని మచ్చలా మిగిలిపోనుంది!

తిరుపతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. ప్రత్యక్షసాక్షులు, ఇతర వర్గాల కథనం ప్రకారం...


బైరాగిపట్టెడలో మరణ మృదంగం

బైరాగిపట్టెడలోని రామానాయుడు మునిసిపల్‌ హైస్కూ లు ఆవరణలో టోకెన్ల జారీకి పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో భక్తులు చేరుకున్నారు. హైస్కూలు వెనుకవైపు మునిసిపల్‌ పార్కు లో కూర్చుని... ఎదురు చూస్తున్నారు. రాత్రి 8.50 సమయంలో క్యూలైన్లలోకి అనుమతించడంతో అందరూ పరుగులు తీశారు. పార్కు నుంచి స్కూలులోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటుపై జనం పడటంతో అది ఒక్కసారిగా తెరుచుకుంది. పెద్దసంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. భక్తుల్లో మహిళలు, వృద్ధులు ఉండడంతో చాలామంది కిందపడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అదుపు చేసేసరికే దారుణం జరిగిపోయింది. తొక్కిసలాటలో పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు సీపీఆర్‌ వంటి చర్యలు చేపట్టారు. మరో కథనం ప్రకారం... బైరాగిపట్టెడ కేంద్రంలో ఓ మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు పోలీసు అధికారి గేటు తెరిచారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు.

తొక్కిసలాట ఘటన బాధాకరం: ప్రధాని మోదీ

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని, బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తోందని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: రాహుల్‌

తిరుపతి తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపిందని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి ఘటన జరగడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాలని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు రాహుల్‌ పిలుపునిచ్చారు.

చైర్మన్‌ రాజీనామా చేయాలి

బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ తొక్కిసలాటలో స్వామి వారి భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ డిమాండ్‌ చేశారు. భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో టీటీడీ అధికారులు విఫలం అయ్యారని ఆరోపించారు. వైకుంఠ ద్వార దర్శనాలు జరిగినన్ని రోజులు మరింత అప్రమత్తంగా ఉంటూ సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలన్నారు.


రద్దీని కంట్రోల్‌ చేసుంటే..

కౌంటర్ల వద్ద కనీసం సౌకర్యాలు కల్పించలేదు, పోలీసుల నిర్లక్ష్యం బాగాఉంది. అర్థగంట ముందుగా వచ్చిన రద్దీని కంట్రోల్‌ చేసుంటే కచ్చితంగా తొక్కిసలాట జరిగేది కాదు. సకాలంలో స్పందించి వుంటే కూడా ఈ దారుణం చోటుచేసుకునేదికాదు.

-సీపీ రమణ, నర్సీపట్నం

పోలీసుల వైఫల్యమే

మా కళ్లముందే మావాళ్లను తొక్కేయడం చూశా. ఇది పూర్తిగా పోలీసుల వైపల్యమే. బయట ఉన్నారే గాని పార్కు లోపలకువచ్చి కంట్రోల్‌ చేయలేకపోయారు. - మునివెంకటప్ప, ఊలపాడు

స్వల్పగాయాలతో బయటపడ్డాం

అందరూ కలసి ఒక్కసారిగా గేటును నెట్టుతున్న సమయంలో పోలీసులు స్పందించి అదుపు చేసుంటే పరిస్థితి చక్కబడేది. ఈ ఘటనలో నా భార్య, బిడ్డలు స్వల్పగాయాలతో బతికి బయటపడ్డారు.

-బి.అంజప్ప, నర్సాపురం

ఉన్నతస్థాయి విచారణ చేయాలి: పురందేశ్వరి

ఏడుకొండల వాడా మమ్మల్ని క్షమించు స్వామీ.. భక్తకోటి క్షమించండి.. అంటూ తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలకమండలిని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఏడుకొండల వాడి పాదాల చెంత ఇటువంటి దుర్ఘటన జరగడం తీవ్ర మనస్థాపం కలిగించిందని బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు.

దురదృష్టకరం: ఎంఎస్‌ రాజు

తిరుపతిలో తొక్కిసలాటలో భక్తులు మృతిచెందడం బాధాకరమని టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. ఆ ఘటన తీవ్ర దిగ్ర్భాంతికి లోను చేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు. భక్తులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 04:28 PM