US-AP Online Love: హద్దుల్లేని ప్రేమ.. ప్రియుడి కోసం అమెరికా నుంచి ఆంధ్రాకు
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:22 PM
ప్రేమించిన వాడిని వివాహం చేసుకోవడం కోసం ఎల్లలు దాటి, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ వచ్చింది ఓ యువతి. పరిచయం మొదలు పరిణయం వరకు వారి ప్రయాణం ఎలా సాగింది అనే వివరాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.

అమరావతి: ప్రేమ.. ఈ రెండక్షరాల మాటకున్న శక్తిని వర్ణించడం ఎవరితరం కాదు. చరిత్రలో ప్రేమ కోసం జరిగిన యుద్ధాలు, పోయిన ప్రాణాలు ఎన్నో. ప్రేమించిన వారితో కలిసి ఉండలేక.. ప్రాణాలు వదిలిన వారు మరేందరో. ఒకప్పుడు ప్రేమంటే ఎంతో పవిత్రమైన బంధం.. అయితే కొందరు స్వార్థపరుల కారణంగా నేటి కాలంలో ప్రేమంటే ఓ బూతులా మారింది. అందరూ అలానే ఉంటారంటే కాదు. ఈ కాలంలో కూడా ఎందరో నిజమైన ప్రేమికులు ఉన్నారు. ఈ కోవకు చెందిన ఓ జంట గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
నేటి సోషల్ మీడియా యుగంలో.. ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారితో అయినా సరే మాట్లాడగలుగుతున్నాం.. పరిచయం పెంచుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ జంటకు కూడా సోషల్ మీడియానే వారధి. అమెరికా అమ్మాయి.. ఆంధ్రా అబ్బాయి మధ్య పరిచయం, ప్రణయం, త్వరలో జరగబోయే పరిణయానికి సోషల్ మీడియా వారధిగా నిలిచింది. అది ఎలానో తెలియాలంటే ఇది చదవండి.
ఆన్‌లైన్ పరిచయం..
అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరోకి.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ చందన్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తన ప్రియుడిని పెళ్లాడటం కోసం జాక్లిన్ తన తల్లితో కలిసి అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చింది. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీ ఎక్కడ, ఎలా మొదలైంది వంటి వివరాలకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ వివరాలు..
"మా పరిచయం హాయ్ అనే సాధారణ పలకరింపుతో మొదలయ్యింది. ఆ తర్వాత అది పెరిగి... మనస్ఫూర్తిగా ఒకరి ఇష్టాలు, కష్టాలు, అభిరుచులు, అభిమతాలు మరొకరం తెలుసుకునే స్థాయికి చేరుకుంది. మా పరిచయం జరిగిన 14 నెలల్లో ఎప్పుడు ప్రేమలో పడ్డామో మాకే తెలియదు. త్వరలోనే మా జీవితంలో అతి పెద్ద చాప్టర్‌ని ప్రారంభించబోతున్నాం" అని ప్రకటించింది.
8 నెలల డేటింగ్ తర్వాత..
"చందన్ ఎంతో సాధారణంగా ఉండే వ్యక్తి. నేనే ముందుగా అతడిని పలకరించాను. మా ఇద్దరి అభిరుచులు చాలా వరకు కలిశాయి. మేం 8 నెలలుగా ఆన్‌లైన్ డేటింగ్‌లో ఉన్నాం. ఆ తర్వాత మా అమ్మ ఆశీర్వాదంతో.. చందన్‌ను వివాహం చేసుకోవడానికి.. మా అమ్మతో కలిసి ఇండియా వచ్చాను" అని చెప్పుకొచ్చింది. అంతేకాక.. "మా బంధన్ని చూసి చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా గురించి చాలా మంది విమర్శలు చేశారు" అని వెల్లడించింది.
"నేను చందన్ కన్నా 9 సంవత్సరాలు పెద్దదాన్ని. కానీ మాకు అది పెద్ద సమస్య అనిపించలేదు" అని చెప్పుకొచ్చింది ఫోరెరో. "మా ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాం. కానీ దేవుడి దయతో వాటన్నింటిని దాటుకుని వచ్చేశాము. ఆ దేవుడే మిమ్మల్ని కలిపాడు.. కలిసి ఉండమని దీవించాడని" చెప్పుకొచ్చింది. వీరి లవ్ స్టోరి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. చాలా మంది వీరి ప్రేమకు మద్దతు తెలుపుతున్నారు. వయసు తేడా గురించి పట్టించుకోకండి.. ఇతరులు విమర్శలు మనసుకు తీసుకోకుండా.. మీ జీవితంలో సంతోషంగా ముందుకు సాగండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరిద్దరి పేరు మీద ఓ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
Viral Video: ఎండు ద్రాక్షను లొట్టలేసుకుని తింటున్నారా.. ఎలా తయారు చేస్తున్నారో చూస్తే.
Hyderabad: వారిద్దరూ స్నేహితులు.. చిన్నవిషయంలో వచ్చిన తేడాతో చివరకు..