IPS Officer Palle Joshua: రజనీ ఫిర్యాదుతోనే తనిఖీ!
ABN, Publish Date - Mar 25 , 2025 | 04:23 AM
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్‌పై ఫిర్యాదు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా వెల్లడించారు.
లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్‌పై కేసులు పెట్టాలని ఒత్తిడి చేశారు
విజిలెన్స్ అధికారులకు ఐపీఎస్ జాషువా రాత పూర్వక వివరణ
గత అక్టోబరులోనే వాంగ్మూలం..
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ లిఖిత పూర్వక ఫిర్యాదుతోనే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్‌లో తనిఖీలు చేపట్టామని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా విజిలెన్స్ అధికారులకు వివరించారు. గుంటూరు జిల్లా ఆర్‌వీఈవోగా తాను పనిచేస్తున్న సమయంలో ఆమె స్వయంగా విజిలెన్స్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యడ్లపాడు మండలంలోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం మైనింగ్ తవ్వకాల్లో రాయల్టీ, కంకర విక్రయాల్లో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతోందని ఆమె రాసిచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, తనపై ఫిర్యాదు అందిన తర్వాత గుంటూరు విజిలెన్స్ కార్యాలయంలో ఆ ఫిర్యాదు కాపీ మాయమైందని తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల్లో ఒకటైన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిపై వేధింపుల వ్యవహారం కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ విచారణను దాటి ఏసీబీలో కేసు నమోదు వరకు చేరింది. ఈ కేసులో రెండో నిందితుడైన ఐపీఎస్ అధికారి జాషువా గత ఏడాది అక్టోబరు చివరి వారంలో విజిలెన్స్‌కు ఇచ్చిన వాంగ్మూలం సోమవారం వెలుగు చూసింది. రజనీ ఈ కేసులో అసలు సూత్రధారి అని ఆయన పేర్కొన్నారు.
లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్‌లో అక్రమాలు వెలికి తీయాలని ఆమె చేసిన ఫిర్యాదుపై రహస్య విచారణ చేయగా ఆ వ్యక్తులు టీడీపీకి చెందిన వారిగా తేలిందన్నారు. చిలకలూరిపేట సెంటర్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటుకు స్టోన్ క్రషర్ భాగస్వామి కట్టా శ్రీనివాస్ చేసిన ప్రయత్నాన్ని రజనీ అడ్డుకోవడంతో రాజకీయ వైరం మరింత ఎక్కువైందన్నారు. అందుకే ఆమె ఫిర్యాదు చేసినట్లు గ్రహించానని వివరించారు. మైనింగ్ వ్యవహారంలో గుంటూరు మైన్స్ అండ్ జియాలజీ ఏడీ, సర్వేయర్‌తో సర్వే చేయించి పదిన్నర కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లుగా తేల్చినట్లు పేర్కొన్నారు. ఆ అంచనాలు కూడా పారదర్శకంగా లేవని తాను గుర్తించినట్లు చెప్పారు. అయినా ఆ మొత్తాన్ని భారీగా పెంచాలంటూ రజనీ ఒత్తిడి చేశారని, తనిఖీలకు వెళ్లిన వారిపైనా ఒత్తిడి తెచ్చారని వివరించారు. మైనింగ్ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయించినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Mar 25 , 2025 | 04:23 AM