Steel Plant Workers : ప్రధాని పర్యటనలో విశాఖ ఉక్కుపై ప్రకటన చేయాలి
ABN , Publish Date - Jan 07 , 2025 | 06:47 AM
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని లేదా సెయిల్‌లో విలీనం చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడుపుతామని..
కార్మికుల ఆందోళన... బైఠాయింపు ర్యాలీ
కూర్మన్నపాలెం (విశాఖ పట్నం), జనవరి 6 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని లేదా సెయిల్‌లో విలీనం చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడుపుతామని ఎనిమిదో తేదీన విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు, నిర్వాసితులు సోమవారం ఉదయం 9.30 నుంచి 10.00 గంటల వరకూ కూర్మన్నపాలెం జంక్షన్‌లో కర్మాగారానికి వెళ్లే మార్గంలో బైఠాయించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ 1,425 రోజులుగా కార్మికులు వివిధ రూపాల్లో ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనంతరం సుమారు 800 ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లారు.