Share News

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా 2047 విజన్‌ ప్రణాళికలు

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:48 AM

క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా 2047 విజన్‌ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ సూచించారు.

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా 2047 విజన్‌ ప్రణాళికలు

  • నియోజకవర్గాల రూపురేఖలు మారాలి

  • కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):

క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరాలను పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా 2047 విజన్‌ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ సూచించారు. ‘కెపాసిటీ బిల్డింగ్‌’పై శుక్రవారం నగరంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల అధికారులకు నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర-2047 విజన్‌ ప్రణాళిక అమలుకు అనుగుణంగా తాత్కాలిక వార్షిక ప్రణాళికలు తయారుచేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల రూపురేఖలు మార్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ రంగాలుగా గుర్తించిన వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. మే 15వ తేదీకల్లా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. విజన్‌ ప్రణాళిక అమలు కమిటీకి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, నియోజకవర్గ కమిటీలకు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి ఇన్‌చార్జిగా, ఆయా జోనల్‌, మండల స్థాయి అధికారులు, ఎంపీడీవోలు కన్వీనర్లుగా వ్యవహరిస్తారన్నారు. ఒక్కొక్క కమిటీలో ఐదుగురు సచివాలయ సిబ్బంది ఉంటారన్నారు. వర్క్‌షాపులో రాష్ట్ర స్థాయి నోడల్‌ అధికారి, పలువురు డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

కేజీహెచ్‌లో మందుల కొరత

అవుట్‌ పేషెంట్‌లకు వారానికే ముందులు

అంతకు మించి ఇవ్వవద్దని ఆదేశాలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):

కింగ్‌ జార్జి ఆస్పత్రిలో మందుల కొరత ఏర్పడింది. మధుమేహం, రక్తపోటు, నరాల సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలతో వస్తున్న అవుట్‌ పేషెంట్‌లకు నెలకు సరిపడా మందులు ఇవ్వడం లేదు. నెల రోజుల కిందటి వరకూ రెండు వారాలకు, పది రోజులకు సరిపడా ఇచ్చేవారు. ఇప్పుడు మరీ కష్టం కావడంతో సూపరింటెండెంట్‌ శుక్రవారం ప్రత్యేక సర్క్యులర్‌ జారీచేశారు. అవుట్‌ పేషెంట్‌ విభాగంలో విధులు నిర్వహించే ఫ్యాకల్టీ, సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు, పీజీ వైద్యులు, హౌస్‌ సర్జన్‌ చేస్తున్న వైద్యులు ఇకపై అంటే శనివారం నుంచి ఒక్క వారానికి మాత్రమే రోగులకు మందులు రాయాలని ఆదేశించారు. అంటే ఇకపై రోగులు మందుల కోసం ప్రతి వారం కేజీహెచ్‌కు రావలసి ఉంటుంది. ఇది పెద్ద సమస్య. దీనిపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కేజీహెచ్‌కు పూర్తిస్థాయిలో మందులు అందేలా చూడాల్సి ఉంది.

కర్నూలు, బెంగళూరు, తిరుపతికి ప్రత్యేక రైళ్లు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి):

వేసవి ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి కర్నూలు, బెంగళూరు, తిరుపతికి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నామని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

విశాఖ-కర్నూలు సిటీ-విశాఖ: 08545 నంబరు గల రైలు ఈనెల 15 నుంచి వచ్చే నెల 27 వరకు ప్రతి మంగళవారం రాత్రి 7.00 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 9.35 గంటలకు కర్నూలు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08546 నంబరు గల రైలు ఈనెల 16 నుంచి వచ్చే నెల 28 వరకు ప్రతి బుధవారం సాయంత్రం 4.10 గంటలకు కర్నూలులో బయలుదేరి మర్నాడు ఉదయం 8.00 గంటలకు విశాఖ చేరుతుంది.

విశాఖ-బెంగళూరు-విశాఖ: 08581 నంబరు గల రైలు ఈనెల 13 నుంచి వచ్చే నెల 25 వరకూ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08582 నంబరు గల రైలు ఈనెల 14 నుంచి వచ్చే నెల 26 వరకూ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్‌ఎంవీ బెంగళూరులో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుతుంది.

విశాఖ-తిరుపతి-విశాఖ: 08547 నంబరు గల రైలు ఈనెల 16 నుంచి వచ్చే నెల 28 వరకూ ప్రతి బుధవారం రాత్రి 7.00 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08548 నంబరు గల రైలు ఈనెల 17 నుంచి వచ్చే నెల 29 వరకూ ప్రతి గురువారం రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరునాడు ఉదయం 11.30 గంటలకు విశాఖ చేరుతుంది.

Updated Date - Apr 12 , 2025 | 12:48 AM